AP CID Notices to Lokesh: రెడ్ బుక్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. రెడ్ బుక్ పేరుతో లోకేశ్ తమను బెదిరిస్తున్నాడని ఏపీ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరిన విషయం తెలిసిందే.
సీఐడీ అధికారులు లోకేశ్‌కు రెడ్ బుక్ అంశంలో నోటీసులు అందించారు. ఈ అంశంలో వారు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం సూచనల మేరకు సీఐడీ నోటీసులు పంపించింది. వాట్సాప్‌లో నోటీసులు అందుకున్న లోకేశ్, వాట్సప్‌లోనే నోటీసులు అందుకున్నట్లు తిరిగి వారికి సమాధానామిచ్చారు. ఈ కేసు విచారణను ఇప్పటికే ఏసీబీ కోర్టు జనవరి 9వతేదీకి వాయిదా వేసింది.
నారా లోకేశ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు నోటీసులు
అసలేంటీ ఈ రెడ్ బుక్ కథ:లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. యాత్ర ప్రారంభం నుంచి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేస్తూ ఇబ్బంది పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలతోనే పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారని వారిని ఊరికే వదిలిపెట్టబోనని లోకేశ్ గతంలోనే వ్యాఖ్యనించారు. ఈ క్రమంలోనే అడ్డంకులు సృష్టించిన వారి పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నానని ఆయన వెల్లడించారు.