ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 31, 2023, 9:06 AM IST

Updated : Mar 31, 2023, 9:38 AM IST

ETV Bharat / state

బ్రహ్మయ్య అండ్‌ కొ ఆడిటర్​ కుదరవల్లి శ్రావణ్‌ను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ

AP CID Arrested Kudaravalli Shravan: బ్రహ్మయ్య అండ్‌ కొ ఆడిట్‌ సంస్థ భాగస్వామి కుదరవల్లి శ్రావణ్‌ను ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. శ్రావణ్‌కు ఏప్రిల్‌ 11 వరకు జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీచేశారు.

AP CID Arrested Kudaravalli Shravan
కుదరవల్లి శ్రావణ్‌ను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ

బ్రహ్మయ్య అండ్‌ కొ ఆడిటర్​ కుదరవల్లి శ్రావణ్‌ను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ

AP CID Arrested Kudaravalli Shravan : బ్రహ్మయ్య అండ్‌ కొ ఆడిట్‌ సంస్థ భాగస్వామి కుదరవల్లి శ్రావణ్‌ను ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. గురువారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో విజయవాడలోని మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రాజశేఖర్‌ ఇంటి వద్ద ఆయనను హాజరుపరిచింది. శ్రావణ్‌కు ఏప్రిల్‌ 11 వరకు జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థపై నమోదు చేసిన కేసులో భాగంగా తమ ముందు వివరాలతో హాజరుకావాలని ప్రఖ్యాత బ్రహ్మయ్య అండ్‌ కొ సంస్థ ఆడిటర్‌ శ్రావణ్‌కు సీఐడీ నోటీసు ఇచ్చింది.

ఆ నోటీసును గౌరవించి వివరాలు సమర్పించడానికి ఏపీలోని సీఐడీ అధికారుల ముందు హాజరైన శ్రావణ్‌ను ఐదో నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేసి న్యాయాధికారి ముందు రిమాండు నిమిత్తం హాజరుపరిచింది. ఈ సందర్భంగా శ్రావణ్‌ తరఫు న్యాయవాదులు ఎస్‌.రమేశ్‌, బొమ్మసాని రవి, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ రిమాండును తిరస్కరించాలని న్యాయాధికారి వద్ద వాదనలు వినిపించారు. రిమాండు విధింపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆడిటర్‌ను సీఐడీ అరెస్టు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఆడిట్‌ నిర్వహణలో లోటుపాట్లుంటే ‘వృత్తి సంబంధ నైపుణ్య’ విభాగాల్లో ఫిర్యాదు చేయాలన్నారు.

ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్న కేసుల్లో 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు. ఆ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా తప్పించుకునేందుకు ఐపీసీ 409 (పబ్లిక్‌ సర్వెంట్‌, బ్యాంకర్‌, మర్చంట్‌, ఏజెంట్‌ నేరపూర్వక విశ్వాసఘాతుకానికి పాల్పడటం) లాంటి తీవ్ర సెక్షన్‌ను సీఐడీ నమోదు చేసిందన్నారు. వృత్తిసంబంధ బాధ్యతలు నిర్వహించిన ఆడిటర్‌కు 409 సెక్షన్‌ ఎలా వర్తిస్తుందన్నారు. ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలోని సెక్షన్‌ 5 నమోదు వర్తించదన్నారు. కక్షసాధింపులో భాగంగా తీవ్రమైన సెక్షన్లు నమోదు చేసి సీఐడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చడానికి తప్పుడు కేసులు నమోదు చేస్తోందన్నారు. సీఐడీ ఇచ్చిన నోటీసును గౌరవించి విచారణకు హాజరైన శ్రావణ్‌ను 48 గంటలకుపైగా వారి వద్దే ఉంచుకున్నారన్నారు. విచారణకు సహకరిస్తున్న వ్యక్తిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. శ్రావణ్‌కు మెడపైన స్వల్ప గాయం అయ్యిందని న్యాయాధికారి దృష్టికి తీసుకొచ్చారు. రిమాండును తిరస్కరించాలని కోరారు. సీఐడీ తరఫు న్యాయవాది రిమాండు విధించాలని కోరారు. దర్యాప్తునకు సహకరించలేదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయాధికారి ఏప్రిల్‌ 11 వరకు జ్యుడిషియల్‌ రిమాండు విధించారు.

చట్టబద్ధ ఆడిటర్‌కు ఐపీసీ 409 సెక్షన్‌ వర్తించదు :బ్రహ్మయ్య అండ్‌ కొ భాగస్వామి శ్రావణ్‌ను సీఐడీ అధికారులు నిరాధార ఆరోపణలతో అరెస్టు చేశారని ఆ సంస్థ భాగస్వామి తోట వెంకటరమణ పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్‌ 409 ప్రభుత్వ ఉద్యోగులకు, చిట్‌ఫండ్‌ చట్టంలోని 76, 79లు ఫోర్‌మెన్‌కు మాత్రమే వర్తిస్తాయని, చట్టబద్ధ ఆడిటర్‌కు ఆ సెక్షన్లు వర్తించవని వివరించారు. కానీ శ్రావణ్‌ను ఆ సెక్షన్ల ప్రకారం అరెస్టుచేసి రిమాండుకు పంపించారని పేర్కొన్నారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు.

విజయవాడలో గురువారం ఆయన మాట్లాడారు. ‘‘మా సంస్థ స్థాపించి 90 ఏళ్లు అవుతోంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ ఎకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) నిర్దేశించిన ప్రమాణాలు, కంపెనీ చట్టాలకు సంబంధించిన ప్రొసీజర్స్‌, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి, వాటికి అనుగుణంగానే మేము పని చేస్తాం. అన్నిరకాల చట్టాలు, నియమ నిబంధనలకు లోబడి ఉన్నాయా, లేదా అనేది చూసుకునే ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లను మేము కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పిస్తాం.

బ్యాంక్‌ రీ కన్సిలేషన్స్‌ వంటివి ఏమైనా ఉన్నా సాధారణ ప్రక్రియలో భాగంగా జరుగుతాయి. ఏటా మార్చి 31న పార్టీలు, చందాదారుల నుంచి చెక్కులు తీసుకుంటాం. అవి మర్నాడు రియలైజ్‌ అవుతాయి. దీని ఆధారంగా ప్రజాధనం బయటకు వెళ్లిపోయిందన్న ఆరోపణలతో అరెస్టుచేశారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటాం’’ అని వెంకటరమణ వివరించారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 31, 2023, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details