కేబినెట్ రాజీనామాలు ఆమోదించిన గవర్నర్
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా భారీ మెజారిటీ సాధించటంతో ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. ఇతర మంత్రులు రాజీనామాలు గవర్నర్కు సమర్పించగా... ఆమోదించినట్టు గవర్నర్ కార్యాలయం తెలియజేసింది. చంద్రబాబు సహా 24 మంది మంత్రుల రాజీనామాను ఆమోదించిన గవర్నర్ నరసింహన్ తదుపరి ప్రభుత్వం ఏర్పాటైయ్యే వరకూ కొనసాగాల్సిందిగా సూచించారు.
రాష్ట్రంలో ఘన విజయంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో అప్పటి దాకా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. వైకాపాకు భారీ మెజారిటీ రావటంతో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజీనామా సమర్పించారు. అటు మంత్రివర్గంలోని ఇతర మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, లోకేష్, కళావెంకట్రావు, అచ్చెన్నాయుడు, సుజయ్ కృష్ణరంగారావు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, జవహర్, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, సిద్ధా రాఘవరావు, పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భూమా అఖిలప్రియ, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, అమర్నాథరెడ్డి, ఫరూఖ్లు రాజీనామా లేఖల్ని గవర్నర్కు సమర్పించగా... ఆయన ఆమోదించారు.
ఈ రాజీనామాలను నోటిఫై చేసినట్టుగా గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకూ అపద్ధర్మ ప్రభుత్వాన్ని నడపాల్సిందిగా గవర్నర్ చంద్రబాబుకు సూచించారు.