రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు భారంపై మడమ తిప్పిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. గోరుచుట్టుపై రోకటి పోటు అన్న చందంగా ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి, ఆదాయం తగ్గి కుదేలవుతున్న ప్రజలకు ప్రభుత్వం కరెంట్ షాక్ ఇస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని పాదయాత్రలో పదే పదే హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్దుబాటు ఛార్జీల పేరుతో ఐదేళ్ల క్రితం నాటి ఖర్చుల వ్యత్యాసం వసూళ్ల కోసం మడమ తిప్పారని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. సామాన్యుడి నెత్తిమీద ప్రతినెలా అదనపు ఆర్థిక భారం నెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు కరెంటు బిల్లులకు లింకు పెట్టిన తరుణంలో ఈ అదనపు భారం వల్ల పింఛన్లు కోల్పోతామనే భయం లబ్ధిదారుల్లో నెలకొంటోందని.. వారికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.