ఏపీ అభివృద్ధిలో ప్రధాని మోదీ (pm modi) కీలక పాత్ర పోషిస్తున్నారని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(somu veerraju news) అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రానికి పెద్ద పీట వేస్తోందన్నారు. రాజకీయాల్లో సేవా సమర్పణ అనే భావన ఉండాలని.. ఆ దిశగానే మోదీ ప్రభుత్వం పని చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ జన్మదిన ఉత్సవాల సందర్భంగా గుంటూరులో సేవా సంతర్పణ కార్యక్రమాన్ని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో కలిసి వీర్రాజు ప్రారంభించారు. తొలుత భాజపా కార్యాలయంలో కార్యకర్తలు రక్తదాన కార్యక్రమం నిర్వహించగా.. అనంతరం ప్రధాని మోదీ సాధించిన విజయాల చిత్రపటాలను ఆవిష్కరించారు. 25 మంది చర్మకారులకు ట్రంకు పెట్టెలను పంపిణీ చేశారు.
రాష్ట్రం విడిపోయాక ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చేశారో చెప్పాలని వీర్రాజు డిమాండ్ చేశారు. విజయవాడ నుంచి నల్లజెర్ల వరకు నాలుగు రహదారుల విస్తరణ కార్యక్రమం జరుగుతోందని.. నిమ్మకూరు, నాగాయలంకలో రక్షణ రంగ అభివృద్ధి సంస్థలను కేంద్రం అభివృద్ధి చేయనుందని చెప్పారు. బద్వేలులో పోటీ చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. మిత్రపక్షమైన జనసేన పార్టీని అంగీకరింపజేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాజకీయాలు వేరు.. సిద్ధాంతాలు వేరని ఈ సందర్భంగా సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.