ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు 14 రోజులపాటు జరగనున్నాయి. శాసనసభలోని స్పీకర్ ఛాంబర్లో సభాపతి తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి , మంత్రులు అనిల్ యాదవ్, కన్నబాబు, తెదేపా నుంచి శాసనసభ ఉపనేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అదే రోజు మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను సభ ముందుంచనున్నారు.
14 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొత్త సంప్రదాయం
సంప్రదాయానికి భిన్నంగా బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజు ముందే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశాలకు ఒకరోజు ముందే బీఏసీ సమావేశం నిర్వహణతో కొత్త సంప్రదాయానికి తెరతీశామని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. సమావేశాల్లో విపక్షానికి కోరినంత సమయం ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారని.. ఏ సమస్యపై అయినా అర్థవంతమైన చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు.
ప్రతిపాదనలు
అవసరం అయితే సమావేశాల సమయం పొడిగించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం గా ఉందని తెలిపారు. వ్యవసాయ రంగం, రైతు భరోసా, అమ్మఒడి, పారదర్శక పాలన, 50 శాతం రిజర్వేషన్లు, ఆరోగ్య శ్రీ, గృహ నిర్మాణం, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, విద్యుత్ రంగం, సీఆర్డీఏ భూ కేటాయింపులు, కొత్త ఎక్సైజు విధానం, కొత్త ఇసుక విధానం, ప్రాజెక్టుల్లో అవినీతి లాంటి 23 అంశాలపై చర్చించాలని వైకాపా ప్రతిపాదించిందని మంత్రి వివరించారు.
గతంలో బీఏసీ సమావేశంలో వైకాపాకు మాట్లాడే అవకాశాలను అప్పటి ప్రభుత్వం కల్పించలేదని ఇప్పుడు తమ ప్రభుత్వం విపక్షాలకు పూర్తి స్వేచ్ఛ కల్పించిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఏసీ, అసెంబ్లీలో చర్చించే అంశాలు కూడా తెదేపా దగ్గర లేకపోవడం శోచనీయమని అన్నారు. తెదేపా రాష్ట్రంలో కరువుపై చర్చించేందుకు ప్రతిపాదించింది దానికి అంగీకారాన్ని తెలిపామన్నారు.
12న ఆర్థికపద్దు...14 రోజుల పాటు సమావేశాలు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వ ప్రతిపాదనలకు తామెక్కడా అడ్డుతగల్లేదని శాసనసభలో తెదేపా ఉపనేత అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కరవుపై చర్చించాలని తెదేపా ప్రతిపాదించిందని..దానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. రేపు ప్రశ్నోత్తరాల తర్వాత కరవుపై చర్చిస్తామని వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులు అయ్యిందని.. రాష్ట్రంలో పొలిటికల్ ఎన్కౌంటర్లు అవుతున్నాయని..ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారని..వీటపై చర్చకు డిమాండ్ చేశామన్నారు. ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తామని బీఏసీలో సీఎం హామీ ఇచ్చారని...అందుకు స్వాగతిస్తున్నామని అచ్చెన్నాయుడు వివరించారు.
12న ఆర్థికపద్దు...14 రోజుల పాటు సమావేశాలు మొత్తం 23 అంశాలపై అధికార పక్షం వైకాపా బీఏసీలో చర్చకు ప్రతిపాదించింది. తెలుగుదేశం పార్టీ 3 అంశాలను చర్చించాలని ప్రతిపాదించింది.
మంత్రివర్గ భేటీ
శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 12న ఉదయం 8గంటలకు ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించనుంది.
ఇదీ చదవండి :"శ్వేతపత్రాలు వాస్తవాలను వక్రీకరించేలా ఉండొద్దు"