ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక భేటీ..అధికారుల ప్రత్యేక చర్యలు - ప్రత్యేక అసెంబ్లీ భేటీకి నిరసన సెగ తగలకుండా జాగ్రత్తలు
అసెంబ్లీ ప్రత్యేక భేటీకి వచ్చే ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగలకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు వచ్చే మార్గంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. కృష్ణాయపాలెం నుంచి అసెంబ్లీకి వెళ్లే రహదారిని పునరుద్ధరిస్తున్నారు.
రాజధాని వికేంద్రీకరణపై ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యే ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగలకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గాన్ని పునరుద్ధరిస్తున్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేల కోసం గత ప్రభుత్వం ఈ రహదారిని నిర్మించింది. రాజధానిలో అంతర్గత రహదారుల నిర్మాణం కోసం ఈ రోడ్డు కింద వంతెన పనులు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రహదారిని మరమ్మతుల పేరుతో మూసేశారు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళన దృష్ట్యా ఈ మార్గాన్ని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యే లకు అమరావతి రైతుల సెగ తగలకుండా ఈ రహదారి నుంచి తరలించవచ్చని అధికారులు నిర్ణయించారు. ఈ తరుణంలో గత రెండ్రోజులుగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.