ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం ఉక్కు పాదం మోపినా సమ్మె పట్టు సడలించేది లేదు- అంగన్వాడీలు - అంగన్వాడీలు సంతకాల సేకరణ

AP Anganwadis Agitation: తమకు కనీస వేతనం అందించాలని రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలు 33వ రోజుకు చేరుకున్నాయి. 33వ రోజూ ఆందోళనలను అంగన్వాడీలు హోరెత్తించారు. ప్రభుత్వం వారిపై ప్రయోగించిన ఎస్మా చట్టం ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. షో కాజ్ నోటీసుల పేరిట ప్రభుత్వం బెదిరిస్తుందని ధ్వజమెత్తుతున్నారు.

ap_anganwadis_agitation
ap_anganwadis_agitation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 8:12 PM IST

AP Anganwadis Agitation: ఉక్కుపాదం మోపినా ఎస్మాను ప్రయోగించినా అంగన్వాడీలు బెదరడం లేదు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ 33వ రోజూ ఆందోళనలు హోరెత్తించారు. ముందస్తు భోగి మంటల్లో ప్రభుత్వ జీవో ప్రతులను వేసి తగలబెట్టారు. కోటి సంతకాల సేకరణను చేపట్టారు. సర్కారు సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు.

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ 33వ రోజూ అంగన్వాడీలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నినదించారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ తీశారు. సీఐటీయూ నాయకులు మహిళలకు మద్దతు తెలిపారు.

ప్రభుత్వ తాటకు చప్పుళ్లకు వెనక్కి తగ్గేదే లేదు : అంగన్వాడీలు

విజయవాడ ధర్నా చౌక్​లో అంగన్వాడీలు నిరసన తెలిపారు. లక్ష మంది మహిళలు కోటి సంతకాలు చేసి జగనన్నకు సమస్యల చిట్టా పంపుతామని తెలిపారు. గుంటూరులో కలెక్టరేట్‌ ఎదుట రంగవల్లులు వేసి నిరసన వ్యక్తం చేశారు. షో కాజ్ నోటీసుల పేరిట ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు.

అనంతపురం జిల్లా ఉరవకొండలో హంద్రీనీవా కాలువలో ఎస్మా జీవో ప్రతులను కృష్ణా జలాలలోకి వదిలి నిరసన తెలిపారు. గోడు కనపడ లేదా వినపడలేదా అంటూ నినాదాలు చేశారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుక్కరాయసముద్రం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఎస్మాను ఉపసంహరించుకోవాలని కర్నూలులో అంగన్వాడీలు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం: అంగన్వాడీలు

తిరుపతి పాత మున్సిపల్‍ కార్యాలయం వద్ద ముందుగానే భోగి మంటలు వేసి ఎస్మా జీవో ప్రతులను అంగన్వాడీలు తగలబెట్టారు. ఆడవారి ఆకలి మంటలు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరులో అంగన్వాడీలకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ర్యాలీ నిర్వహించాయి. గాంధీ బొమ్మ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన చేశారు. ఎస్మావద్దని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద పాటలు పాడుతూ నినాదాలు చేశారు. విధుల్లోకి చేరకపోతే తొలగిస్తామంటూ చేస్తున్న సజ్జల బెదిరింపులకు తలొగ్గబోమన్నారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఐసీడీఎస్​ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం కావాలంటూ నినదించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో గొబ్బిళ్లు చుట్టూ తిరుగుతూ పాటల పాడారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వానికి మాపై కక్ష ఎందుకు? - చర్చలకు పిలవకుంటే ఆందోళన ఉద్ధృతం: అంగన్వాడీలు

ప్రభుత్వం ఉక్కు పాదం మోపినా సమ్మె పట్టు సడలించేది లేదు

ABOUT THE AUTHOR

...view details