ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంటలు రేపుతున్న ఆర్జీవీ వ్యాఖ్యలు వర్సిటీ వీసీ ఏమన్నారంటే - rgv comments on women

ANU VC On Ram Gopal Varma: నాగార్జున యూనివర్సిటీలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో.. దీనిపై వర్సిటీ వీసీ స్పందించారు. వర్మను సృజనాత్మకత ఉన్న వ్యక్తిగా గుర్తించి.. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంచేందుకే ఆహ్వానించామని.. ఆయన ఏం మాట్లాడతారనే విషయంతో తమకు సంబంధం లేదని వీసీ వింత వివరణ ఇచ్చారు. వర్మ వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

RGV speech at Nagarjuna University
నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవీ స్పీచ్

By

Published : Mar 16, 2023, 7:27 PM IST

Updated : Mar 16, 2023, 7:54 PM IST

Nagarjuna University VC on RGV: రాంగోపాల్ వర్మ బుధవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆర్జీవీ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. పలువురు రాజకీయ నేతలు, విద్యార్థి సంఘ నాయకులు వర్మపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిరంతరం వార్తల్లో ఉండాలనే వ్యక్తి రాంగోపాల్ వర్మ అని ఆరోపిస్తున్నారు.

ఆర్జీవీ వ్యాఖ్యలపై వివాదం.. నాగార్జున యూనివర్సిటీ వీసీ క్లారిటీ

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి రాంగోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్ధులు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని.. కష్టపడాల్సిన అవసరం లేదని.. నచ్చిన వాళ్లతో తిరగాలని వర్మ వ్యాఖ్యానించారు.

రంభ, ఊర్వశి, మేనక:35 సంవత్సరాల క్రితం తాను విజయవాడలోని సిద్దార్ధ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశానని.. పట్టాను తాజాగా తనకు ఏఎన్​యూ అందజేయడం చాలా ఆనందంగా ఉందని.. సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ పేర్కొన్నారు. తన లాంటివారు హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్​నే ఎక్కువగా నమ్ముతారని అన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదవాలని పేర్కొన్నారు. అలా కాకుండా కష్టపడి చదవితే కూలీలుగా మారతారని జోక్ చేశారు. విద్యార్థులు తెలియని విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. చచ్చిపోయి పైకి వెళ్లినా.. రంభ, ఊర్వశి, మేనక ఉంటారని.. కాబట్టి ఇబ్బందేమీ లేదంటూ విద్యార్థులకు చెప్పారు.

వెనుక బెంచీ: మీకు నచ్చినట్లు మీరు జీవించాలని విద్యార్థులకు సూచించారు. తాను ఎప్పుడూ వెనుక బెంచీలోనే కూర్చునేవాడినని.. వెనుక బెంచీవాళ్లే జీవితంలో పైకి వస్తారని.. మొదటి బెంచ్​లో కూర్చున్నవారు ఎందుకూ పనికిరారని రాంగోపాల్ వర్మ అన్నారు. వెనక బెంచీలో కూర్చునే వారు జీవితంలో పైకి వస్తారు అని చెప్పడానికి తానే ఒక నిదర్శనమని వర్మ తెలిపారు.

బతికుంటే చాలు: వైరస్ వచ్చి మగజాతి మొత్తం చనిపోయినా.. తాను ఒక్కడిని బతికుంటే చాలని అన్నారు. హీరోల రెమ్యూనిరేషన్ పెంపుదలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. హీరో మార్కెట్ వాల్యూ బట్టే రెమ్యూనరేషన్ ఇస్తారని.. ఇచ్చేవాళ్లకు.. పుచ్చుకునేవాడికి లేని సమస్య మనకు ఎందుకని అన్నారు.

మాకేం సంబంధం లేదు: అకడమిక్ ఎగ్జిబిషన్​కు వర్మను ఆహ్వానించడంపై తీవ్రంగా విమర్శలు రావడంతో.. నాగార్జున యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ వి. రాజశేఖర్ స్పందించారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంచేందుకే సినీ దర్శకులు రాంగోపాల్ వర్మను యూనివర్శిటీకి ఆహ్వానించినట్లు ఆయన సమర్ధించుకున్నారు. ఆయన ఏం మాట్లాడుతారనే విషయంతో తమకు సంబంధం లేదని వీసీ వింత వివరణ ఇచ్చారు. ఈ ఉత్సవాన్ని ఇంజినీరింగ్ విద్యార్ధుల్లో ఉన్న వినూత్న ఆలోచనలు వెలికితీసేందుకే ఏర్పాటు చేశామన్నారు.

యూజీసీకి లేఖ:దర్శకుడు రాంగోపాల్ వర్మ, నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్లపై సుమోటోగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మహిళ కమిషన్, యూజీసీ ఛైర్ పర్సన్లకు తెలుగు మహిళా అధ్యక్షురాలు, టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత లేఖ రాశారు. మహిళలను కించపరిచేలా దర్శకుడు ఆర్జీవీ కామెంట్లు చేశారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. యూనివర్శిటీలో జరిగే కార్యక్రమానికి మహిళలను కించపరిచే వ్యక్తిగా ముద్రపడ్డ ఆర్జీవీని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నాగార్జున యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ వి. రాజశేఖర్, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజకీయ దుమారం: రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. పలువురు రాజకీయ నేతలు, విద్యార్థి సంఘ నాయకులు వర్మ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిరంతరం వార్తల్లో ఉండాలనే వ్యక్తి రాంగోపాల్ వర్మ అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. గుంటూరు నగరంలోని రమేష్ హాస్పిటల్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాలు వర్మకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

ఈ మధ్య ఆయన మానసిక రోగంతో బాధపడుతున్నట్లు కనిపిస్తోందని మస్తాన్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. భగవంతుడు వర్మకు మంచి బుద్ధిని ప్రసాదించాలన్నారు. భారత సంస్క్రతికి వ్యతిరేకంగా జాతి తలదించుకునేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. విశ్వవిద్యాలయాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నవారు దేశానికి మంచి సందేశం ఇచ్చేలా.. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చూపే విధంగా మాట్లాడాలని సూచించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత అనేది ఉంటే వెంటనే రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 16, 2023, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details