AP Weather Update: ఈ ఏడాది ఎండాకాలం కాస్త వానాకాలంగా మారింది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో పలు చోట్ల ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకూ కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ విభాగం తెలియజేసింది.
దీనికి అనుబంధంగా కర్ణాటక, తమిళనాడుల నుంచి నైరుతీ బంగాళాఖాతం వరకూ మరో ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ/ దక్షిణ దిశలో గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనికితోడు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదు అవుతాయని స్పష్టం చేసింది. అటు రాయలసీమలోనూ చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.