Case Against Ramachandra Bharati : Another case against Ramachandra Bharati: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన "తెరాస ఎమ్మెల్యేలకు ఎర" కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నాడని.. బంజారాహిల్స్ పోలీసులు రామచంద్ర భారతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గత నెల 26న రామచంద్ర భారతితో పాటు మరో ఇద్దరిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీసులు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8తో పాటు... పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ ఈ కేసులో కీలక భూమిక పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.