లాక్డౌన్ సమయంలో ఆహారం కోసం మనుషులే కాదు మూగజీవాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయం గమనించి గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఓ చిరుద్యోగి... రోడ్ల వెంట ఆహారం లేక అలమటిస్తున్న శునకాలకు బిస్కట్లు, పాలు అందిస్తున్నాడు. శానిటరీ ఇన్ స్పెక్టర్‌గా పనిచేస్తున్న విజయభాస్కర్ రోజూ విధులకు వెళ్లే సమయంలో తన వెంట బిస్కట్ ప్యాకెట్లు తీసుకెళ్తున్నాడు. మూగజీవాలు కనిపించిన చోట ఆగి... వాటికి బిస్కట్లు పెట్టి ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. చిన్నచిన్న కుక్కపిల్లలకు పాలు పోస్తున్నాడు.
జంతు ప్రేమికా.. మీసేవకు సలాం - animal lover
నోరు లేని జంతువులు, పక్షులకు ఆహారం, నీరు దొరక్క జనారణ్యంలోకి వస్తుంటాయి. వేసవిలో గుక్కెడు నీరు లేక ఎన్నో జంతువులు ప్రాణాలు కోల్పోతుంటాయి. లాక్డౌన్ కారణంగా మూగజీవాలు మరింత ఆకలితో అలమటిస్తున్నాయి. పలు వీధుల్లో ఉండే శునకాలు తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నాయి. అటువంటి మూగజీవాలకు కడుపునింపే పనిలో నిమగ్నమయ్యాడు ఓ జంతు ప్రేమికుడు.
మూగజీవాలకు కడుపునింపే పనిలో నిమగ్నమైన జంతు ప్రేమికుడు
కరోనా అందరికీ కష్టాలు తెచ్చిందని... మూగజీవాలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉందని విజయభాస్కర్ ఆవేదన వ్యక్తంచేశారు. కుక్కలకు ఆహారం లేకపోతే.... ఈ వేసవిలో వాటికి పిచ్చిపట్టే అవకాశం ఉందని చెప్పారు. అవి కరిస్తే మనుషులకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాడు. అందుకే మూగజీవాల ఆకలి తీర్చటం అందరూ అలవాటు చేసుకోవాలని విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు.