Anganwadis protested with children in AP:సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన అంగన్వాడీలు ఆరోరోజూ ఆందోళన కొనసాగించారు. చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. పలుచోట్ల ఆందోళనలో పాల్గొన్న అంగన్వాడీల పిల్లలు, తమ తల్లుల జీతాలు పెంచండంటూ నినదించారు. అంగన్వాడీలకు వచ్చే మహిళలు సమ్మెకు సంఘీభావం తెలిపారు. సచివాలయ సిబ్బందితో కేంద్రాలు నడిపితే తమ పిల్లల్ని పంపించబోమని తెల్చిచెప్పారు.
జగన్ మామయ్య మా అమ్మలకు జీతాలు పెంచండి: రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కర్నూలులో అంగన్వాడీ సిబ్బంది చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. రెండు సార్లు చర్చలు జరిపిన ప్రభుత్వం, జీతాలు పెంచబోమని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నంద్యాలలో ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీలతో పాటు తల్లులు, పిల్లలు ర్యాలీలో పాల్గొన్నారు. కడప అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద తల్లులు చేస్తున్న సమ్మెకు పిల్లలు మద్దతు తెలిపారు. జగన్ మామయ్య మా అమ్మలకు జీతాలు పెంచండంటూ, విజ్ఞప్తి చేశారు. బద్వేలులో కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గోవింద నామస్మరణతోసాష్టాంగ నమస్కారాలుచేస్తూ నిరసన తెలిపారు.
సమ్మెలో అంగన్వాడీలు - 'సచివాలయ ఉద్యోగులకు ఆటవిడుపు'
అంగన్వాడీ కార్యకర్తలు మౌన దీక్ష: ఏలూరు జిల్లా కైకలూరులో, అంగన్వాడీకి వెళ్లే చిన్నారులు, తల్లులు, పోషకాహార లబ్ధిదారులు ఆందోళనకు మద్దతు తెలిపారు. మహిళా పోలీసులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వస్తే తమ పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపించబోమన్నారు. కేంద్రాల తాళాలు పగలకొట్టడంపై విజయనగరంలో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళాలు బద్దలు కొట్టిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో అంగన్వాడీ కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు.
ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించాలి - లేకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తాం: అంగన్వాడీ కార్యకర్తలు
జగన్ మామయ్యా ఏంటి మాకీ దుస్థితి:ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చెవిలో పూలు పెట్టుకొని అంగన్వాడీలు ఆందోళన చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందికి అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఉన్నాను నేను విన్నాను అన్న జగనన్న ఇప్పుడు ఎందుకు ముఖం చాటేస్తున్నావు అంటూ బాపట్ల జిల్లా సంతమాగులూరులో ఆందోళన నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల పలకలపై జగన్ మామయ్యా ఏంటి మాకీ దుస్థితి అంటూ రాసి నిరసన తెలిపారు. బాపట్లలో అంగన్వాడీలు ఆకులు తింటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలులో అద్దంకి బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. చెవిలో పూలు పెట్టుకొని రోడ్డుపై నిరసన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సెంటర్ అద్దెలు, ఇతర బకాయిలు వెంటనే విడుదల చేయాలని వివిధ రకాల యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఐదోరోజూ ఆగని అంగన్వాడీల పోరాటం - మద్దతు తెలిపిన పలు రాజకీయ పార్టీలు
జగన్ మామయ్య మా అమ్మలకు జీతాలు పెంచండి!