Anganwadi Workers Protest: సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు 36వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. కనుమ పండుగ వేళ వినూత్న నిరసనలతో హోరెత్తించారు. నంద్యాలలో స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపాన రహదారిపై దీక్షా శిబిరంలో గాలిపటాలతో నిరసన తెలిపారు. ఎస్మా చట్టం రద్దు చేయాలని గాలి పటాలపై రాసి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు సమ్మె విరమించమన్నారు.
ప్రభుత్వ ఎస్మా నోటీసులతో బెదిరించినా వెనక్కి తగ్గేది లేదని కర్నూలులో ఆందోళన చేశారు. పండుగలు లేకుండా రోడ్డుపాలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం దిగే వచ్చే వరకు సమ్మె ఆపేది లేదంటూ అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. ఎన్ని రోజులైనా సమ్మె చేసి, ప్రభుత్వాన్ని గద్ద దింపుతామని హెచ్చరించారు. తమ డిమాండ్లను వచ్చే ప్రభుత్వంలోనైనా సాధించుకొని విధుల్లోకి హాజరవుతామని తెలిపారు.
అంగన్వాడీల దీక్షా శిబిరానికి నిప్పు - వైసీపీ నాయకులపై అనుమానం
కల్యాణదుర్గం తహశీల్దార్ కార్యాలయం వద్ద జగన్, సజ్జల, బొత్స ఫొటోలు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల దీక్ష శిబిరానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తమను బెదిరించడానికి వైసీపీ నేతలు, ప్రభుత్వమే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతోందని అంగన్వాడీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి చర్చలు ఎన్ని చేసినా తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.