Anganwadi Workers Protest: రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని అంగన్వాడీలు స్పష్టం చేశారు. విజయవాడ ధర్నాచౌక్‌లో కోలాటం ఆడుతూ నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం చేయలేని ప్రభుత్వం, ఈనెల 5వ తేదీ లోగా విధుల్లో చేరకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అన్యాయమన్నారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ విమర్శించారు. గత 22 రోజుల నుంచి అంగన్వాడీలు పోరాడుతుంటే వారి డిమాండ్లు పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద జరిగే ఆందోళనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కనీస వేతనాలు ఇచ్చేవరకు, గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించే వరకు అంగన్వాడీల సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు
అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాల రాష్ట్ర నాయకులు ఈ నెల 9న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు పోరాడుతుంటే, డిమాండ్లు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని కార్మిక నేతలు మండిపడ్డారు. కనీస వేతనం ఇచ్చే వరకు, రిటైర్మైంట్ బెనిఫిట్స్ కల్పించే వరకు కార్మికులు, ఉద్యోగుల సమ్మె విరమించరని స్పష్టం చేశారు. సీఎం జగన్కు సొంత పార్టీ నేతలు, సొంత చెల్లెల నుంచే తిరుగుబాటు మొదలయ్యిందని మండిపడ్డారు.
లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే సమస్యలు పరిష్కారం చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయలేని వైసీపీ ప్రభుత్వం ఈనెల 5వ తేదీలోగా విధుల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వడం అన్యాయమన్నారు.