Anganwadi Workers 34th Day Protests: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ 34వ రోజూ అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జోవో నంబర్ 2 ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. సీఎం జగన్ ఎవరిని అయితే నమ్ముతున్నారో వారే తనను ముంచుతారని అనంతపురంలో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట భోగి మంటలు వేసి ఆందోళనలో పాల్గొన్నారు.
పండగ పూటా అంగన్వాడీల ఆందోళన - ఎస్మా, జీవో నంబర్ రెండు ప్రతుల దహనం శ్రీకాకుళంలో అంగన్వాడీలు దీక్షా శిభిరం వద్ద భోగి మంటలు వేసి ఎస్మా చట్టం ప్రతులను దహనం చేశారు. భోగి పండుగను కుటుంబసభ్యులతో కలిసి అక్కడే జరుపుకున్నారు. చిన్నారులకు భోగి పళ్లును వేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో అంగన్వాడీ సిబ్బంది నిరసన తెలిపారు. భోగిమంటల్లో జీవో నెంబర్ 2 కాపీలను వేశారు.
ప్రభుత్వం ఉక్కు పాదం మోపినా సమ్మె పట్టు సడలించేది లేదు- అంగన్వాడీలు
కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసీడీఎస్ కార్యలయం ఎదుట భోగి మంటల్లో జీ.వో. నంబర్ 2 ప్రతులను దగ్ధం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను గుంటూరులో అంగన్వాడీలు భోగి మంటల్లో వేసి కాల్చారు. ఇవి భోగి మంటలు కాదు, తమ ఆకలిమంటలని ఆవేదన వెలిబుచ్చారు. సమస్యలు పరిష్కరించడం చేత కాని ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
విజయవాడ ధర్నా చౌక్‌లో 4వ రోజు అంగన్వాడీలు నిరవధిక సమ్మె కొనసాగించారు. అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి అంగన్వాడీలు నిరసన తెలిపారు. ప్రభుత్వం చర్చలతో కాలయాపన చేయకుండా తక్షణమే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ముగ్గులు వేసి రంగవల్లులు అద్దారు. చిన్నారులకు భోగి పండ్లు పోశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ చేశారు. 34 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని నోటికి రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారని, ఎస్మా చట్టాన్ని ఎలా ఉపయోగిస్తారు అని అంగన్వాడీలు ప్రశ్నించారు.
అంగన్వాడీల అలుపెరగని పోరాటం - డిమాండ్లు నేరవేర్చాలని డిమాండ్
నంద్యాలలో అంగన్వాడీలు భోగి మంటలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు. పండుగ రోజు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడిందని అంగన్వాడీ కార్యకర్తలు వాపోయారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ సిబ్బంది నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు భోగి మంటలు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్మా జీవో ప్రతులను మంటల్లో వేసి దహనం చేశారు. డిమాండ్లు నెరవేర్చాలని 34 రోజులుగా సమ్మె చేస్తున్నా న్యాయం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ జిల్లా మైదుకూరులో భోగి మంటలు వేసిన అంగన్వాడీలు ఎస్మా, జీ.వో. నంబర్ రెండు ప్రతులను తగులబెట్టారు. జమ్మలమడుగు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు భోగి మంటలలు వేసి ఎస్మా చట్టం, జీ.వో. నంబర్ రెండు ప్రతులను దహనం చేశారు. కడపలోని అంగన్వాడీ దీక్షా శిబిరం వద్ద మాట తప్పిన జగన్ అని, బైబై జగన్ అన్నా అని ముగ్గువేశారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.
ఎస్మా ప్రయోగంతో తమ సమ్మెను ఆపలేరని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఎవరిని అయితే నమ్ముతున్నారో వారే తనను ముంచుతారని అనంతపురంలో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట భోగి మంటలు వేసి నిరసన తెలిపారు.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం: అంగన్వాడీలు