ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్​వాడీ సమ్మెపై వైఎస్సార్సీపీ సర్కార్ ఉక్కుపాదం - విరమించేదే లేదంటున్న 'అక్కచెల్లెమ్మలు' - ఏపీ రాజకీయ వార్తలు

Anganwadi Staff Agitations in AP: రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ ఉద్యోగులు పగలగొడుతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తే అంతకంటే మొండిగా ఎదిరిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.

Anganwadi_Staff_Agitations_in_AP
Anganwadi_Staff_Agitations_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 6:47 PM IST

Anganwadi Staff Agitations in AP: సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె నాలుగో రోజు కొనసాగుతోంది. చాలీచాలనీ జీతాలు ఇవ్వడంతో కుటుంబపోషణ కష్టమైందని అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాల ఉద్యోగులు పగలగొడుతున్నారు. దీనిపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు.

అనంతపురం జిల్లాలో:
అనంతపురం కలెక్టరేట్ వద్ద చెవిలో పూలు పెట్టుకుని నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే అంగన్వాడీ భవన తాళాలు పగల కొట్టి సచివాలయ సిబ్బందితో విధులు నిర్వహించేలా ప్రభుత్వం మొండి వైఖరితో ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.

కళ్యాణదుర్గం ఐసీడీఎస్ పరిధిలో మూడు గ్రామాల్లో సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పగలగొట్టారు. కళ్యాణదుర్గంలో నిరసన చేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు మున్సిపల్ కార్మికులు మద్దతు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు సచివాలయ సిబ్బంది పగలగొట్టడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

అన్నమయ్య జిల్లాలో:
అన్నమయ్య జిల్లా సుండుపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయచోటి మండలం దిగువ అబ్బవరం, కమ్మపల్లి అంగన్వాడీ కేంద్రాల తాళాలు సచివాలయ సిబ్బంది పగలగొట్టారు. మదనపల్లి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ ఆర్కర్లు నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్​కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టిన అధికారులు - సమ్మె అణచివేతకు ప్రభుత్వం యత్నం

విశాఖ జిల్లాలో:
కనీస వేతనాలు చెల్లించాలంటూ గత నాలుగు రోజులుగా సమ్మెబాట పట్టిన అంగన్వాడి కార్యకర్తలకు పలు పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఎన్నికలకు ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్​లో చేపట్టిన ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్ష పార్టీలతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దతు తెలిపారు.

న్యాయపరమైన కోర్కెల కోసం అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతానని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే సంస్కృతి వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదని కేఏ పాల్ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.

అక్కాచెల్లెళ్లంటూనే నడిరోడ్డుపై నిలబెట్టారు - అంగన్వాడీల ఆవేదనపై నోరు మెదపని జగనన్న

ప్రకాశం జిల్లాలో:
అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాల ఉద్యోగులు పగలగొట్టడాన్ని అంగన్వాడీలు, వర్కర్లు వ్యతిరేకించారు. డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగోరోజు కొనసాగుతుంది. కనీస వేతనం, గ్రాట్యూటి, పీఎఫ్ అమలు వంటి పలు డిమాండ్లతో అనగన్వాడీలు దీక్షకు దిగారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వైఎస్సార్సీపీ నేతలు అంగన్వాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తప్పుబట్టారు. మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, యర్రగొండపాలెం మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మార్కాపురంలోని 52వ అంగన్వాడీకేంద్రం తాళం పగలగొట్టేందుకు వెళ్లిన సచివాలయ సిబ్బందిని అక్కడి అంగన్వాడీలు అడ్డుకున్నారు. కార్యాలయం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అనంతరం ర్యాలీ నిర్వహించారు.

CM Jagan Cheated Anganwadi Workers: అంగన్వాడీలను నిలువునా ముంచిన జగన్‌ సర్కార్‌..ఇచ్చిన హామీలను మర్చిపోయిన ప్రభుత్వం

ఎన్టీఆర్ జిల్లాలో:
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎంపీడీవో కార్యాలయాన్ని అంగన్వాడీ వర్కర్లు ముట్టడించారు. నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీడీవో లక్ష్మీకుమారిని ఘెరావ్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలు ఆమె కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల సాయంతో లోపలికి వెళ్లాలని భావించినా అంగన్వాడీల నిరసన హోరుతో ఎంపీడీవో వెనక్కి తగ్గారు. కార్యాలయంలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

కోనసీమ జిల్లాలో:
కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీలు నాలుగో రోజు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీలకు జనసేన నేత పితాని బాలకృష్ణ, తెలుగుదేశం నాయకుడు జనిపెల్ల సత్యనారాయణతోపాటు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం - జనసేన ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వంతో చర్చలు విఫలం - సమ్మె సైరన్ మోగించిన అంగన్వాడీలు

కృష్ణా జిల్లాలో:
అంగన్ వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్రాలను ప్రభుత్వ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకొని తాళాలు పగలగొడుతున్నారు. దీనిపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మెువ్వలో అధికారులు తాళాలు పగలగొట్టి కేంద్రాలను తెరిచారు. అడ్డుకున్న ఐద్వా(All India Democratic Women's Association) నేతలు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.

అంగన్వాడీ కేంద్రాలలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే గన్నవరంలో రెవెన్యూ సిబ్బంది తాళాలు పగలగొడుతుండగా కార్యకర్తలు అడ్డగించారు.

కడప జిల్లాలో:

కడప జిల్లాలో అంగన్వాడీల నాలుగో రోజు నిరవధిక దీక్ష కొనసాగుతోంది. మరోవైపు రాయచోటి మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో హరిజనవాడల ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి పంచనామ నిర్వహించారు.

కర్నూలు జిల్లాలో:
కర్నూలు జిల్లా ఆస్పరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. చేసేదేంలేక పోలీసులు వెనుదిరిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ సిబ్బంది నినాదాలు చేశారు. సీఎం జగన్ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details