Anganwadi Protest Against YSRCP Government:పనికి తగ్గ ప్రతిఫలం కోసం పోరాడుతున్న మహిళలపై ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని అంగన్వాడీలు 33వ రోజు ఆందోళనలతో హోరెత్తించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోరాటానికి ప్రజా మద్దతు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం ఆపేదిలేదని ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు నిరాహార దీక్ష చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని దీక్షా శిబిరం నుంచి సోమప్ప కూడలి వరకు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నంద్యాలలో గుమ్మడి కాయలు కొట్టి అంగన్వాడీలు నిరసన తెలిపారు. బద్వేల్‌లో మూడు నామాలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వం ఉక్కు పాదం మోపినా సమ్మె పట్టు సడలించేది లేదు- అంగన్వాడీలు
తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద భోగి మంటలు వేసి ఎస్మా జీవో ప్రతులను తగలబెట్టారు. పలమనేరులో అంగన్వాడీలకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. నాయుడుపేట ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట భోగి మంటలు వేసి సమస్యల్ని పరిష్కరించాలని పాటలు పాడారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్మా ప్రతులను భోగిమంటలో వేసి దహనం చేశారు. బుక్కరాయసముద్రం తహశీల్దార్ కార్యాలయం వద్ద జగనన్నకు చెబుదామంటూ.. అంగన్వాడీలు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఉరవకొండలోని హంద్రీనీవా జలాల్లో ఎస్మా జీవో ప్రతులను వదిలి అంగన్వాడీలు నిరసన తెలిపారు. అంగన్వాడీల సమ్మెకు సీపీఐ నేత రామకృష్ణ మద్దతు తెలిపారు. మేలో ఇంటికి వెళ్లే ముఖ్యమంత్రి జూలైలో అంగన్వాడీల వేతనాలు ఎలా పెంచుతారని దుయ్యబట్టారు.