Andhra Pradesh Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రానున్న 2 - 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 4 నుంచి 6 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన వడగాలులు వీస్తాయమి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటిస్తూ.. ఎండల తీవ్రత నుంచి కాపాడుకోవాలని పేర్కొంది.
మోచా తుపాను సమాచారం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను మోచా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌కు 680 కిలోమీటర్లు, మయన్మార్‌కు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉన్నట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది.
తదుపరి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఈ నెల 14 తేదీన మధ్యాహ్నానికి కాక్స్ బజార్ వద్ద తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్టు తెలిపింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పొడివాతావరణం.. కొనసాగుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది.
జిల్లాల వారీగా రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే?: కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాగల 2 -3 రోజుల్లో 4 -6 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో నంధ్యాలలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అన్నమయ్య జిల్లాలో 42.57 డిగ్రీలు, కృష్ణా జిల్లాలో 41.9 డిగ్రీలు, తూర్పుగోదావరి 41.8, విజయనగరం జిల్లాలో 41.8 డిగ్రీలు, ప్రకాశం 41.5, గుంటూరు 41.53, నెల్లూరు 41.4, ఏలూరులో 41.38 డిగ్రీలు, కాకినాడ 41.3, పలనాడు 40.9, పశ్చిమగోదావరిలో 40.82, ఎన్టీఆర్ జిల్లాలో 40.81 డిగ్రీలు, కడప 40.15, పార్వతీపురం మన్యం జిల్లాలో 39.9 డిగ్రీలు, బాపట్ల 39.7, కోనసీమ 39.4, శ్రీకాకుళం 39.4, అల్లూరి జిల్లాలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం..ప్రతి రోజు అందరూ 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తప్పక తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎండలో తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే కాటన్‌తో తయారు చేసిన తెల్లని వస్త్రాలు, తలకు టోపి ధరించాలని. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: