ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Capital Expenditure: మూలధన వ్యయంలో దయనీయ స్థితిలో రాష్ట్రం.. చిన్న రాష్ట్రాలకంటే కూడా - ఏపీ అభివృద్ధి

AP Capital Spending: దేశంలోనే రిచ్చేస్ట్​ సీఎం ఉన్న మన రాష్ట్రం.. మూలధన వ్యయంలో మాత్రం వెనకబడిపోయింది. భారత్​లోని 25 రాష్ట్రాల మూలధన వ్యయాలను గమనించగా.. అందులో ఆంధ్రప్రదేశ్​ అట్టడుగు స్థానంలో దర్శనమిస్తోంది. దేశంలో చిన్న రాష్ట్రామైన నాగాలాండ్​ కంటే మూలధన వ్యయంలో ఏపీ వెనకబడిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

AP Capital Spending
ఏపీ మూలధన వ్యయం

By

Published : Jun 26, 2023, 9:45 AM IST

మూలధన వ్యయంలో దయనీయ స్థితిలో రాష్ట్రం.. చిన్న రాష్ట్రాలకంటే కూడా

Andhra Pradesh Battom Stage In Capital Expend: నేటితో పాటు రేపటి రోజు అనేది ఒకటుంటుంది. అది మనిషికైనా.. రాష్ట్రానికైనా.. దేశానికైనా. కానీ, ప్రస్తుత వైఎస్సార్​సీపీ ప్రభుత్వం మాత్రం.. ఈ పూట గడిచిపోతే చాలు అనుకుంటోంది. భవిష్యత్తు ఎటు పోతే మనకు ఎందుకు అనే ధోరణిని అవలంబిస్తోంది. దొరికినచోట, అందినకాడికి అప్పులు తెస్తోంది. పథకాలు అంటూ బటన్‌లు నొక్కి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు గొప్పలు పోతోంది. రాష్ట్రం శాశ్వతం అనే విషయాన్ని మర్చిపోయింది. మూలధన వ్యయంలో గడిచిన కొన్ని సంవత్సరాల వైఎస్సార్​సీపీ ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులు, ఖర్చులను గమనిస్తే ఇది సుస్పష్టమవుతోంది.

విద్య, ఆరోగ్య సౌకర్యాలు, రహదారులు, భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణం తదితరాలపై ఖర్చుచేసే మొత్తాన్ని మూలధన వ్యయంగా పరిగణిస్తారు. మూలధన వ్యయం వల్ల సంపద సృష్టి జరుగుతుంది. వీటిపై ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో ఆదాయం సమకూరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే సంపదకు మూలధన వ్యయమే ఆధారం. ఇప్పుడు పెట్టే మూలధన ఖర్చుతోనే ప్రజల ఆదాయం పెరుగుతుంది. జీవనోపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఉదాహరణకు ఒక ప్రాజెక్టు కడితే దాని నుంచి లభించే నీటి ద్వారా.. లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించవచ్చు. సాగు నీరు అందుబాటులో ఉంటే పంటలు పండి, రైతులకు ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా వ్యవసాయం పైన ఆధారపడి నడుస్తున్న ఇతర రంగాల్లోనూ వృద్ధి నమోదవుతుంది. దీనివల్ల ఇది చివరకి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. అలాంటిది దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి ఉన్న ఏపీ.. మూలధన వ్యయంలో మాత్రం అట్టడుగున నిలిచింది.

ఇరవై ఐదు రాష్ట్రాల మూలధన వ్యయాలను పరిశీలిస్తే మన రాష్ట్రం చివరన ఉంది. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం మూలధన వ్యయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో దేశంలోనే అతి చిన్న రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, త్రిపుర కంటే కూడా ఆంధ్రప్రదేశ్​ వెనకంజలో ఉంది. అతి చిన్న రాష్ట్రమైన నాగాలాండ్‌ 7వేల 936 కోట్ల రూపాయలను మూలధన వ్యయం కింద ఖర్చు చేయగా.. ఏపీ మాత్రం మూలధన వ్యయం కింద 6 వేల 917 కోట్ల రూపాయలనే ఖర్చు చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాలు వారి 2022-23 బడ్జెట్‌ మూలధన కేటాయింపుల్లో 50 శాతం.. అంతకంటే ఎక్కువ మూలధన వ్యయం చేశాయని.. ఏపీలో మాత్రం అది 23శాతమేనని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను జూన్‌ 22వ తేదీన విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం కర్ణాటక, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలు తమ బడ్జెట్‌ మూలధన కేటాయింపులకు మించి ఖర్చుపెట్టాయి. ఎనిమిది రాష్ట్రాలు కేటాయింపుల్లో 70శాతం పైన, మరో తొమ్మిది రాష్ట్రాలు 50శాతం పైన మూలధన వ్యయం చేశాయి. దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాలు చేసిన మూలధన వ్యయానికి దరిదాపుల్లోనే ఆంధ్రప్రదేశ్​ లేదు. ఆయా రాష్ట్రాల్లో ఖర్చుచేసిన మొత్తంలో సగం కూడా మన రాష్ట్రంలో ఖర్చు చేయలేదు. గత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద కర్ణాటక 56 వేల 907 కోట్లు ఖర్చుచేసింది. తమిళనాడు 38 వేల 732 కోట్లు, తెలంగాణ 17 వేల 336 కోట్లు, కేరళ 13,407 వ్యయం చేశాయి. ఒడిశాలోనూ మూలధన వ్యయం 33 వేల 462 కోట్లుగా ఉంది. అది ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 6 వేల 917 కోట్లు మాత్రమే ఉంది.

గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే మూలధన వ్యయం రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా తగ్గింది. 2018-19సంవత్సరంలో అది 19 వేల 856 కోట్లుగా ఉంది. అప్పటి బడ్జెట్‌ మూలధన కేటాయింపుల్లో 70.72 శాతం ఖర్చు చేశారు. 2019-20లో 37.90 శాతం ఉండగా.. 2020-21లో 63 శాతంగా ఉంది. ఇంకా 2021-22లో అయితే 52శాతం చొప్పున మూలధన వ్యయం కింద చూపారు. 2022-23 సంవత్సరంలోనే భారీగా తగ్గిపోయింది. బడ్జెట్‌ మూలధన కేటాయింపుల్లో 23 శాతం మాత్రమే ఉంది. దీన్నిబట్టి ఏపీ పరిస్థితి దేశంలోనే అత్యంత దారుణంగా తయారైందని స్పష్టమైంది. ఆర్థిక అరాచకానికి ఇది పరాకాష్ఠగా నిపుణులు పేర్కొంటున్నారు. అసాధారణంగా అప్పులు చేస్తూ, ఎడతెగని ఖర్చులు పెడుతున్న రాష్ట్రప్రభుత్వం.. ఆస్తుల కల్పన విషయంలో తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగావకాశాల కల్పన, ప్రజల ఆదాయం పెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదనేందుకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details