High Court Dismisses Plea Against Minimum Age Condition In NEET: జాతీయ అర్హత - ప్రవేశ పరీక్ష (నీట్) రాసేవారికి 'ప్రవేశ ఏడాది డిసెంబర్ 31' నాటికి కనీసం 17 ఏళ్లు ఉండాలనే నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. అదే విధంగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. దీనికి సంబంధించిన వ్యవహారాన్ని ఉమ్మడి హైకోర్టు 2013, 2017లోనే తేల్చిందని గుర్తు చేసింది.
కనీస వయసు 17 సంవత్సరాలుగా నిర్ణయించడం ఒక వ్యక్తి సమానత్వపు హక్కును నిరాకరించినట్లు కాదని గతంలోనే ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిందని తెలిపింది. న్యాయస్థానం ఓ సారి నిర్ణయించిన వ్యవహారంపై మరోసారి దాఖలు చేసిన ఈ పిటిషన్‌కి విచారణ అర్హత ఉండదని తేల్చి చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, జస్టిస్ ఆర్.రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
నీట్ రాసేందుకు 'అడ్మిషన్ ఏడాది 2023 డిసెంబర్ 31' నాటికి కనీస వయసు 17 సంవత్సరాలు ఉండాలంటున్న భారత వైద్య మండలి నిబంధన 4(1)ని కొట్టేయాలంటూ కడపకు చెందిన 16 ఏళ్ల ఓ మైనర్ బాలిక తండ్రి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. 17 ఏళ్ల నిబంధన రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛలను ఉల్లంఘించడమేనని.. న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నిబంధన ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘిస్తోందని బాలిక తండ్రి పిటిషన్లో పేర్కొన్నారు.