ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో పెరుగుతున్న ఏకోపాధ్యాయ పాఠశాలలు.. పట్టించుకోని ప్రభుత్వం - One teacher for 20 students in primary schools

A Single Teacher: రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. మొత్తం ఏకోపాధ్యాయ బడులు 12వేలు దాటాయి. 2017తో పోలిస్తే 4వేల 900 ఏకోపాధ్యాయ స్కూళ్ల పెరుగుదలతో.. మధ్యప్రదేశ్‌ తర్వాత దేశంలో రెండో స్థానానికి చేరింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 20, 2023, 10:29 AM IST

రాష్ట్రంలో పెరుగుతున్న ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య

A Single Teacher: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతోపాటు.. 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో... ఒకే ఉపాధ్యాయుడు ఉన్న బడుల సంఖ్య భారీగా పెరిగింది. పార్లమెంటులో ఓ ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సమాధానం ప్రకారం.. యూడైస్‌ ప్లస్‌- 2021-22 గణాంకాల ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్యలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. అత్యధికంగా 16వేల 630 బడులతో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా.. 12వేల 386 పాఠశాలలతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 2017లో 7వేల 483 ఏకోపాధ్యాయ పాఠశాలలతో దేశంలో ఐదో స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండోస్థానానికి చేరింది.

నూతన విద్యావిధానం పేరుతో 3వేల 627 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ ఏడాది సుమారు 4వేల 600 ప్రాథమిక బడుల నుంచి తరగతులను విలీనం చేశారు. ప్రాథమిక బడుల్లో మిగిలిన ఒకటి, రెండు తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం, విలీనంతో కొందరు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోవడంతో.. ఏకోపాధ్యాయ బడుల సంఖ్య పెరిగింది.

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట పాఠశాల విద్యాశాఖ ఒక్కరినే నియమిస్తున్నందున.. విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిచోట్ల 5 తరగతులకూ ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టుల్ని బోధిస్తుండగా.. మరికొన్నిచోట్ల ఒకటి, రెండు తరగతులకు చెబుతున్నారు. ఇలాంటిచోట ఉపాధ్యాయులు సెలవు పెడితే పాఠశాలలు మూతపడుతున్నాయి. దీనివల్ల బోధన గాడి తప్పుతోంది. గత మూడున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు.

ఈ ఏడాది పోస్టులను హేతుబద్ధీకరించారు. ప్రాథమిక పాఠశాలల్లో 20మంది విద్యార్థులకు ఒక టీచర్, 21 నుంచి 60 మంది వరకు ఉంటే రెండో టీచర్‌ను ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించేందుకు ఎస్జీటీలకు పదోన్నతులు ఇచ్చారు. మరోపక్క ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనల కోసమంటూ గతేడాది 4వేల 764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేశారు. ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఎస్జీటీ టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. తరగతుల విలీనం జరగని చోట కొన్ని బడుల్లో 1 నుంచి 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నారు.

ఒకే ఉపాధ్యాయుడు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అన్ని తరగతుల పిల్లలనూ ఒకే గదిలో కూర్చోబెడుతున్నారు. పిల్లల అభ్యసన సరిగా లేకపోయినా తర్వాతి తరగతులకు పంపేస్తున్నారు. విద్యార్థులకు ఎంతవరకు పాఠాలు అర్థమయ్యాయి, ఎంతవరకు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ఏకోపాధ్యాయ బడుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా బోధించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. బోధనతో పాటు మధ్యాహ్న భోజనం, ఆన్‌లైన్‌ హాజరు వివరాల నమోదు, మరుగుదొడ్ల శుభ్రత ఫొటోలు అప్‌లోడ్‌ చేసేందుకు కొంత సమయం పోతోందని అంటున్నారు. ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details