ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరోసారి ఏపీకి అన్యాయం.. బడ్జెట్‌లో వినిపించని రాష్ట్ర ప్రస్తావన - funds for railway zone in Visakhapatnam

Central Budget‍‌: రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, కేంద్ర ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యంతో.. బడ్జెట్‌లో మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మన రాష్ట్ర ప్రస్తావనే లేదు. విభజన జరిగాక.. కేంద్రంలో ఎన్డీఏ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. పది బడ్జెట్లు ప్రవేశపెట్టింది. కానీ రాష్ట్రాలకు సర్వసాధారణంగా ఇచ్చే అరకొర కేటాయింపులు, విదిలింపులే తప్ప ఆంధ్రప్రదేశ్‌కంటూ ఉపయోగపడే ప్రాజెక్టును ఒక్కటైనా ప్రకటించలేదు. రాష్ట్రప్రభుత్వాల నిస్సహాయత, ఏపీపై కేంద్రానికి ఉన్న ఉదాసీనతే దీనికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Central Budget‍‌
Central Budget‍‌

By

Published : Feb 2, 2023, 7:17 AM IST

మరోసారి ఏపీకి అన్యాయం.. బడ్జెట్‌లో వినిపించని రాష్ట్ర ప్రస్తావన

Central Budget‍‌: వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేకహోదా సహా.. విభజన హామీల కోసం కేంద్రం ప్రభుత్వంపై పోరాడాల్సిందేనని రంకెలు వేసింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే, 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే..కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని, విభజన హామీల్ని సాధిస్తామని అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్‌ పదేపదే చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్లేటు ఫిరాయించేశారు. కేంద్ర పెద్దలంటే అంతులేని విధేయత చూపుతూ, కనీసం గట్టిగా అడిగేందుకూ జంకుతూ నాలుగేళ్లు గడిపేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటం... కేంద్ర ప్రభుత్వానికి మరింత లోకువగా మారింది. ఈ బడ్జెట్‌లో కూడా పోలవరం ప్రాజెక్టు, విశాఖలో రైల్వే జోన్‌కు నిధులు కేటాయింపుపై మాట్లాడలేదు.

రామాయపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్‌, రాజధాని నిర్మాణానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం.. ఇలా విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీ గురించీ కనీస ప్రస్తావనా లేదు. అయినా ఈ బడ్జెట్‌ బ్రహ్మాండంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ప్రశంసించడం.. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వైకాపా ప్రభుత్వం ఎంతగా తహతహలాడుతోందో చెప్పడానికి నిదర్శనం. ఆయన స్పందన చూశాక.. జగన్‌ ప్రభుత్వం అంతగా వణికిపోతుంటే ఇక కేంద్రం మాత్రం రాష్ట్రాన్ని ఎందుకు పట్టించుకుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని 2014 ఎన్నికల సమయంలో భాజపా ఇచ్చిన హామీలు శుష్క వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. ప్రతి బడ్జెట్‌లోనూ భాజపా పాలిత రాష్ట్రాలు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వరాలు కురిపిస్తూ, అప్పటికే బాగా అభివృద్ధి చెందిన నగరాల్లోని ప్రాజెక్టులకు నిధుల వరద పారిస్తున్న కేంద్రం తాజా బడ్జెట్‌లోనూ అదే ధోరణి కనబరిచింది.

రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కినా నిధులు చిక్కడం లేదు. అదే సమయంలో కర్ణాటకలోని అప్పర్‌ భద్రకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు ఈ బడ్జెట్‌లో ఏకంగా 5వేల 300 కోట్లు కేటాయించారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధప్రదేశ్‌ నష్టపోతుంది. రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టే ఈ ప్రాజెక్టును నిలువరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. పోలవరానికీ నిధులూ సాధించలేకపోతోంది. ఈ బడ్జెట్‌లో పోలవరం ఊసే ఎత్తలేదు. యూపీ, ఎంపీల ఉమ్మడి ప్రాజెక్టు కెన్‌బెత్వాకు 3వేల 500 కోట్లు కేటాయించారు.

రాష్ట్రంలో అన్ని ఎంపీ స్థానాల్లో గెలిపించండి ప్రత్యేక హోదాతో సహా సర్వం సాధిస్తామని పదేపదే చెప్పిన జగన్‌ ఆఖరికి.. జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరానికి కనీస నిధులు తీసుకురాలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంకా 25వేల కోట్లకు పైగా అవసరం. అలాంటిది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చింది 478 కోట్లు మాత్రమే. దిల్లీ వెళ్లిన ప్రతిసారీ సీఎం జగన్‌ పోలవరం నిధులపై మాట్లాడినట్లు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన నిధులు, అవసరమైన నిధులతో పోలిస్తే ఈ ప్రాజెక్టును పూర్తి కావడానికి మరో 50 ఏళ్లు పడుతుంది. ఇక వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే పోలవరం పూర్తి చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది.

విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే ప్రస్తావన లేదు

విశాఖకు రైల్వేజోన్‌ ఇచ్చామని కేంద్రం చెబుతున్నా.. అడుగు ముందుకు పడటం లేదు. వెనుకబడ్డ రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహం కేటగిరీ కింద.. పరిశ్రమలకు కేంద్ర, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీని తిరిగిచ్చేందుకు ప్రత్యేక హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలకు 2022-23 బడ్జెట్‌లో 3వేల 631 కోట్ల రూపాయలు కేటాయించింది. తాజా బడ్జెట్‌లోనూ రూ.1,714 కోట్లు పెట్టింది. ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కూ ఆ ప్రయోజనం చేకూరేది. ఇంత అన్యాయం జరుగుతున్నా.. పెండింగ్‌లో ఉన్న ప్రధానమైన విభజన హామీల గురించి కేంద్రం వీసమెత్తు పట్టించుకోకపోయినా నిలదీయలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details