IAS Officers Transfers In AP : సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న తరుణంలో.. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా IAS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్, జూనియర్ అధికారులందరినీ కలిపి.. 54 మందిని బదిలీ చేయడంతో పాటు.. పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి.. గురువారం రాత్రి పొద్దుపోయాక.. ఉత్తర్వులు జారీ చేశారు. 8 జిల్లాలకు చెందిన కలెక్టర్లను బదిలీ చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ్‌ను నియమించారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మిని బదిలీ చేశారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా షన్మోహన్‌కు పోస్టింగ్ ఇచ్చారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా.. పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజనను నియమించారు. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషాను, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా విశాఖ మున్సిపల్ కమిషనర్.. రాజబాబును నియమించారు. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా అరుణ్‌బాబు, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఎం.గౌతమికి పోస్టింగ్ ఇచ్చారు. నెల్లూరు కలెక్టర్ చక్రధర్‌బాబును ఏపీ జెన్‌కో ఎండీగా నియమించారు. ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. పురపాలకశాఖ డైరెక్టర్‌గా పి.కోటేశ్వరరావును బదిలీ చేశారు. పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా సూర్యకుమారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ఆ ఇద్దరికి పనిష్మెంట్ పోస్టు: గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సీనియర్ IAS ఆర్.పి. సిసోదియాను.. ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా.. అప్రాధాన్య పోస్టులో ప్రభుత్వం నియమించింది. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ ... అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి.. జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఊహించని ఆ పరిణామంతో.. కంగుతిన్న వైసీపీ ప్రభుత్వం.. ఉన్నపళంగా సిసోదియాను బదిలీచేసింది. ఆయనకు ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. సూర్యనారాయణతో పాటు ఉద్యోగులకు సిసోదియానే గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇప్పించారన్న కారణంతో.. ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందని.. IAS వర్గాల్లో చర్చ జరిగింది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని హఠాత్తుగా తప్పించిన ప్రభుత్వం.. ఆయననూ.. మానవ వనరుల అభిృద్ధి కేంద్రం డైరెక్టర్‌గానే నియమించింది. దానిని జగన్ ప్రభుత్వం.. 'పనిష్మెంట్ పోస్టు'గా మార్చేసిందన్న విమర్శలు ఉన్నాయి.