ఎడాపెడా అప్పులు.. పైగా ఓడీ! Andhra Pradesh Debts 2023: రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు ఎడాపెడా అప్పులు చేస్తూ.. మరో వైపు ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యమూ వాడేస్తోంది. ఆర్థిక నిర్వహణ సరిగా ఉంచుకుని.. ఓవర్ డ్రాఫ్ట్, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, వేస్ అండ్ మీన్స్ ద్వారా వినియోగించుకునే పరిస్థితులు రాకుండా చూసుకుంటే.. వడ్డీల భారం తగ్గుతుందని ఇప్పటికే కాగ్ అనేకసార్లు హెచ్చరించింది. ఐనా పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఈ నెల మొదటివారంలో రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని 3వేల కోట్ల రుణం తీసుకుంది. మరోవైపు 3వ తేదీన 3వేల273 కోట్లను ఓడీ రూపంలో వినియోగించుకుంది.
జులై మొదటి వారంలోనే 6వేల 273 కోట్ల రూపాయల మేర రుణం వాడేసుకుంది. ఓడీ రూపంలో వినియోగించుకున్న నిధులకూ ఆర్‌బీఐ నిర్దేశించిన మేర వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. జులై 11న ప్రభుత్వం మరో 2వేల కోట్ల రుణం తీసుకోబోతోంది. ఓడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న నిధులను నిర్దిష్ట సమయంలోగా ఆర్‌బీఐకి సర్దుబాటు చేయాలి. దీంతో తొలి వారంలో వచ్చిన నిధులన్నీ ఓడీకి జమచేసేందుకే సరిపోతున్నాయి. ఈ నెల 3న 3వేల273 కోట్ల ఓడీలో ఉండగా 4వ తేదీకి 2వేల692 కోట్లకు తగ్గింది. అంటే ఒక్కరోజులోనే రాష్ట్ర ప్రభుత్వం 887 కోట్లు ఓడీ కింద జమ చేసింది. 5వ తేదీ నాటికి ఓడీ వెయ్యి 82 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత మరో రోజులో 1,610 కోట్లు, తర్వాతి రోజే మరో 322 కోట్లు ఓడీకి జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న నిధులన్నింటినీ అప్పులు తీర్చుకోవడానికి, ఓవర్ డ్రాఫ్ట్ నుంచి బయటపడేందుకే వినియోగించాల్సి వస్తోందనడానికి ఈ లెక్కలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రభుత్వానికి ఒక నెలలో పన్నుల రాబడి ఎంత ఉంటుందో దాంతో పోటీపడేంత స్థాయిలో రుణాలు తీసుకుని వాడేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ మార్కెట్ రుణాలు తీసుకునేందుకు కేంద్రం 9 నెలల కాలానికి 30వేల275 కోట్ల రూపాయలకు అనుమతులు ఇస్తే దాంట్లో మిగిలింది ఇంక 3వేల కోట్లే. మరో వారం, పదిరోజుల్లో కేంద్రం ఇచ్చిన పరిమితి ముగిసిపోబోతోంది. కాగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో అన్ని రకాల రెవెన్యూ రాబడులు 9వేల760 కోట్లుగా ఉంటే ఆ నెలలో వివిధ రూపాల్లో తీసుకున్న రుణం 23వేల548 కోట్లు. ఇది రాష్ట్రప్రభుత్వం స్వయంగా కాగ్‌కు సమర్పించిన లెక్క.
ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడి 9వేల196 కోట్లుగా పేర్కొంటే.. బహిరంగ మార్కెట్ ద్వారా తీసుకున్న రుణమే 6వేల కోట్లు. గ్యారంటీలు ఇచ్చి తీసుకొచ్చిన రుణాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం లేదు. మే నెలలో 8వేల714 కోట్లు పన్నుల రాబడిగా ఉంటే ఆ నెలలో బహిరంగ మార్కెట్ నుంచి తీసుకువచ్చిన రుణమే 9వేల 500 కోట్లు. అంటే సొంత పన్నుల రాబడి కన్నా కూడా అధికంగా రిజర్వు బ్యాంకు ఇచ్చిన రుణాలు సమీకరించింది. ఆ నెలలో ఇతర రూపాల్లో ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఇందులో కలపలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 2014-15 రెవెన్యూ లోటు గ్రాంటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో ఒకేసారి 10వేల 460 కోట్లు ఇచ్చింది. ఇవి అందితే ఆర్థికవ్యవస్థను ఎంతో కొంత చక్కదిద్దుకుని అప్పుల తీవ్రత తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. కానీ తొమ్మిది నెలలకు కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితిని మూడు నెలల్లోనే వాడేసుకుని.. ఇతర ప్రజా రుణాలు, గ్యారంటీలు ఇచ్చి తెచ్చుకునే అప్పులు కూడా ఎడాపెడా వినియోగించేస్తున్న ప్రభుత్వం.. రుణభారం తగ్గించుకునే దిశగా ఆలోచించే పరిస్థితి కూడా కనిపించడం లేదు.