ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Congress victory celebrations: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం..ఏపీలో సంబరాలు చేసుకున్న నేతలు - KARNATAKA ELECTIONS NEWS

Congress win in Karnataka elections celebrated in AP: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయాల వద్ద టపాసులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Congress
Congress

By

Published : May 13, 2023, 5:55 PM IST

Updated : May 13, 2023, 7:32 PM IST

Congress win in Karnataka elections celebrated in AP: కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడిన విషయం తెలిసిందే. వెలువడిన ఫలితాల్లో 224 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ 136 స్థానాలు గెలిచి అధికారాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 65 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానానికి పరిమితం కాగా.. కింగ్‌ మేకర్‌ అవుతామని ప్రకటించిన జేడీఎస్‌ పార్టీ 19 స్థానాల్లో గెలుపొందింది. మరో 4 స్థానాల్లో ఇతర పార్టీల వారు విజయం సాధించారు.

గుంటూరు జిల్లాలో సంబరాలు..ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు.. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయాల వద్ద బాణాసంచాలు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ముందుగా గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ సంబరాలు జరుపుకున్నారు.

కన్నడ ప్రజలు మత రాజకీయాల్ని తిప్పికొట్టారు..అనంతరం కర్ణాటక ప్రజలు మత రాజకీయాల్ని తిప్పికొట్టి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని మాజీ పీసీపీ అధ్యక్షుడు శైలజానాథ్ పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై అనంతపురం జిల్లాలోని పార్టీ శ్రేణులతో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ..''కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నాము. బీజేపీ మొదట్నుంచి ఎన్నికల్లో దేవుని మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది.. అదే బాటలోనే గెలవాలని కూడా చూసింది. కానీ, కర్ణాటక ప్రజలు ఎంతో పరిణితితో తీర్పు ఇచ్చారు. దేశంలో ఉన్న ఆస్తులను అమ్మేస్తూ.. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీకి సరైన బుద్ధి చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకెళ్తాం.'' అని ఆయన అన్నారు.

2024లో బీజేపీ కాల గర్భంలో కలిసిపోతుంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం దిశగా దూసుకురావడం తమకు ఎంతో ఆనందాన్ని కల్గించిందని.. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి భారీ విజయం సాధించిందని.. కాంగ్రెస్ పార్టీ ఏపీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కడప జిల్లా వేంపల్లిలో సంబరాలు జరుపుకున్న ఆయన.. బాణాసంచా కాల్చి, స్వీట్లు తినిపించారు. అనంతరం మీడియాతో తులిసి రెడ్డి మాట్లాడుతూ..ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన రోజు అని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, బీజేపీ ఓడిపోవడం ఒక శుభ పరిణామన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయ ప్రభావం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2023-2024లో చరిత్ర పునరావృతం కాబోతున్నదన్నారు. 2024లో బీజేపీ కాల గర్భంలో కలిసి పోతుందని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ ఫలితాలు బీజేపీకి చెంప పెట్టులాంటివి.. కాంగ్రెస్ పార్టీ విజయంపై విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు టపాసులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంప పెట్టులాంటినవి అన్నారు. కాంగ్రెస్‌పై ఉన్న నమ్మకంతో పార్టీని గెలిపించిన కన్నడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఖర్గే ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ఎంతోమంది పెద్దలు టీం‌ వర్కు చేశారని గుర్తు చేశారు. అందరీ సమిష్టి ప్రణాళికతోనే ఈ‌ విజయం వరించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ప్రజల్లో, కాంగ్రెస్ పార్టీలో మంచి‌ జోష్ వచ్చిందని రుద్రరాజు వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం..ఏపీలో సంబరాలు చేసుకున్న నేతలు

ఇవీ చదవండి

Last Updated : May 13, 2023, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details