గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కొడాలి పాపారావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె లక్ష్మి.. ఆమె భర్త గోగినేని రవీంద్ర కుమార్ దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రూప అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఆఫ్రికన్ స్టడీస్ పూర్తి చేసుకుని.. జర్నలిజంపై మక్కువతో వైల్డ్ లైఫ్ జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. నైరోబి కేంద్రంగా ప్రముఖ ఛానెల్లో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే వైల్డ్ లైఫ్‌లో ఫోటో జర్నలిస్ట్‌గా పని చేస్తోన్న ట్రవర్తో పరిచయం ఏర్పడింది. ఆరేళ్లుగా ఇద్దరు కలిసి ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. విషయం తల్లిదండ్రులకు చెప్పటంతో వారి ప్రేమను గౌరవిస్తూ వివాహం చేసేందుకు అంగీకరించారు.
హిందూ సంప్రదాయంలో పెళ్లి
ఇద్దరూ అమెరికా పౌరులు అయినప్పటికీ రూపకు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిపై ఇష్టంతో పెళ్లి అమ్మ సొంత గ్రామమైన గూడవల్లిలోని తాతయ్య ఇంటి దగ్గర జరుపుకోవాలని ఆశతో వరుడిని ఒప్పించింది. అతను అందుకు అంగీకరించటంతో హిందూ ధర్మం ప్రకారం వారి వివాహ వేడుక ఘనంగా జరిగింది.