ఆర్మీ జవాన్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన బాపట్ల మండలం కొండుభొట్లవారిపాలెంలో సోమవారం జరిగింది. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి గోపీచంద్ రెండేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. సికింద్రాబాద్‌లో పనిచేస్తూ సెలవులపై ఇటీవల ఇంటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై బాపట్ల వచ్చి తిరిగి వెళ్తూ ప్యాడిసన్‌పేట సమీపంలో మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో నగరం మండలం చినమట్లపూడికి చెందిన యువకులు షేక్ ఖాజావలి, మొహియుద్దీన్, అయాజ్ గాయపడ్డారు.
కుమారుడి ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందేమోనని ..
కేసు నమోదైతే సైన్యంలో కుమారుడి ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందేమోనని కేసు రాజీ చేసుకోవడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ప్రమాదం జరగడానికి తన తప్పు లేదని, ముందు వెళ్తున్న వాహనం హఠాత్తుగా నెమ్మదించడంతో ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులకు గోపీచంద్ చెప్పాడు. అయినా కేసు రాజీ చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కేబీపాలెం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతదేహానికి ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై ఎస్సైని ప్రశ్నించగా.. రోడ్డు ప్రమాదం విషయంలో అతనిపై కేసు నమోదైందని.. జవాన్‌ను ఎవరూ కొట్టడం గానీ.. దూషించడం కానీ చేయలేదన్నారు. అతను బలవన్మరణానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు.