అమరావతి పరిరక్షణ ఉద్యమ శంఖారావం ఆన్‌లైన్ వేదికగా ప్రతిధ్వనించింది. రాజధాని ఉద్యమం మొదలై 500వ రోజుకి చేరిన సందర్భంగా... ‘‘ఆంధ్రుల బతుకు, భరోసా, భవిత కోసం అమరావతి ఉద్యమ భేరి’ పేరుతో శుక్రవారం అమరావతి పరిరక్షణ సమితి, రైతు జేఏసీ, దళిత జేఏసీ వర్చువల్ సభ నిర్వహించాయి. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో ఆన్‌లైన్ వేదికను ఎంచుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకుని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రకటించేంత వరకు... 5వేల రోజులైనా ఉద్యమాన్ని నడుపుతామని ఉద్యమ సారథులైన మహిళలు, రైతులు ప్రకటించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ సహా పలువురు న్యాయకోవిదులు, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుతోపాటు పలువురు రాజకీయ నాయకులు, విశ్రాంత అధికారులు, సామాజికవేత్తలు, జాతీయ రైతు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, రాయపాటి శైలజ, రైతు జేఏసీ నాయకుడు పువ్వాడ సుధాకర్ తదిరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మందడం, తుళ్లూరు, రాయపూడి, కృష్ణాయపాలెం వంటి రాజధాని గ్రామాల్లోని నిరసన శిబిరాల నుంచి పలువురు మహిళలు ఆవేదన వెలిబుచ్చారు.
ఉద్యమ గీతాల సీడీ ఆవిష్కరణ
మందడం, వెలగపూడి, తుళ్లూరు వంటి రాజధాని గ్రామాల్లో దీక్షా శిబిరాల్లో రైతులు, మహిళలు కరోనా నిబంధనలు పాటిస్తూనే... జెండాలు, ప్లకార్డులు చేతబట్టి, నినాదాలతో హోరెత్తించారు. శిబిరాల్లో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నప్పుడు మందడం శిబిరంలో ఎల్‌ఈడీ తెరపై రైతులు, మహిళలు పువ్వులు చల్లారు. ఉద్ధండరాయునిపాలెం శిబిరంలో బుద్ధుడి విగ్రహం ఆవిష్కరించారు. రాయపూడి శిబిరంలో ‘దళిత చైతన్య గీతిక’ పేరుతో రూపొందించిన ఉద్యమ గీతాల సీడీని ఆవిష్కరించారు.