AMARAVATI FARMERS PADAYATRA : రాజధాని రైతులు తలపెట్టిన అమరావతి నుంచి అరసవల్లి మహాపాదయాత్రకు ఎదురవుతున్న అడ్డంకులపై రాజధాని రైతులు ఇవాళ.. హైకోర్టును ఆశ్రయించనున్నారు. సెలవుల అనంతరం నేడు హైకోర్టు తిరిగి ప్రారంభం కానుండటంతో.. పాదయాత్రకు అడ్డంకులపై కోర్టుకు నివేదించనున్నారు. పిటిషన్‌పై కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా పాదయాత్రను ఈ నెల 29వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించే అవకాశాలను ఐకాస నేతలు, రైతులు పరిశీలిస్తున్నారు.
పాదయాత్ర 41వ రోజున రామచంద్రాపురంలో యాత్ర ప్రారంభయ్యే సమయానికి పోలీసులు.. రైతులు బస చేసిన కల్యాణ మండపాన్ని చుట్టుముట్టారు. అంతకు ముందు రోజు పసలపూడిలో జరిగిన దాడిలో పలువురు మహిళళు తీవ్రంగా గాయపడ్డారు. ప్రజలు సంఘీభావం తెలిపేందుకు వీల్లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నందున.. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలనే ప్రశ్నను.. రైతులు న్యాయస్థానం ముందు ఉంచనున్నారు. ఏకైక రాజధానిగా అమరావతికే ప్రజామద్దతు కోసమే.. అరసవల్లి వరకు ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు తిరిగేలా రూట్ మ్యాప్ తయారు చేసుకున్నామని.. స్పష్టం చేయనున్నారు.
రైతుల మహాపాదయాత్ర అరసవల్లి వద్ద నవంబర్ 11న ముగియాల్సి ఉండగా.. అడ్డంకులు, వర్షాలు, ఇతర సమస్యల దృష్ట్యా.. విరామం ప్రకటించిన 41వ రోజు నాటికే.. అనుకున్న షెడ్యూల్‌కు 5 రోజులు వెనుకబడ్డారు. తాత్కాలిక విరామం కారణంగా.. మరో వారం రోజులు కలుపుకుంటే.. మొత్తంగా 12 రోజులు ఆలస్యమయింది. దీంతో తొలుతు అనుకున్న 60 రోజుల పాదయాత్ర కాస్తా.. ఇప్పుడు 75 రోజుల వరకూ కొనసాగనుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యం సాధించి తీరతామని.. రైతులు స్పష్టం చేస్తున్నారు.