ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు సన్నద్ధంగా అమరావతి రైతులు

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం 261వ రోజూ కొనసాగింది. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లేందుకు రైతులు, దళిత ఐకాస నేతలు సన్నద్ధమవుతున్నారు. ఉద్యమంలో చురుకుగా ఉన్నవారితో కమిటీ వేసి ముందుకెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

amravati-farmers-protest-ongoing-state-wise-at-all-districts
రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు అమరావతి రైతులు సన్నద్ధం

By

Published : Sep 3, 2020, 9:40 PM IST

Updated : Sep 3, 2020, 10:03 PM IST

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధాని గ్రామాల్లో ఆందోళన చేస్తున్న రైతులు... తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేయనున్నారు. మంత్రి మండలి సమావేశం దృష్ట్యా మందడంలో పోలీసులు భారీగా మోహరించారు. మహిళలు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్లే ప్రతీసారి తమను అడ్డుకోవడంపై మండిపడ్డారు. 261రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా సీఎం, మంత్రులు స్పందించకపోవడం దారుణమన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన చెందారు.

రాజధాని ఉద్యమాన్ని ఇతర జిల్లాలకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్టు దళిత ఐకాస నేతలు చెప్పారు. కృష్ణాయపాలెం, పెనుమాక, ఉండవల్లిలో పర్యటించిన నేతలు.... మరింత ఉద్ధృతంగా అమరావతి ఉద్యమం సాగాలని పిలుపునిచ్చారు. అమరావతి సాధన కోసం 13 జిల్లాల ప్రజల మద్దతు కోరనున్నారు. వెలగపూడి, తుళ్లూరులో రైతులు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఉద్యమాన్ని కొనసాగించి తీరుతామని... అమరావతిని కాపాడుకుంటామని రైతులు స్పష్టం చేశారు.

Last Updated : Sep 3, 2020, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details