రాజధాని గ్రామాల్లో అమరావతి నిరసనలు ఉద్ధృతమయ్యాయి. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా 245వ రోజూ తుళ్లూరు ఆందోళన చేశారు. ధర్నా శిబిరంలో మహిళలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అమరావతి తల్లికి సంకెళ్లు పేరిట నాటికను ప్రదర్శించారు. పాలకుల తప్పులకు రాజధాని అమరావతి మూల్యం చెల్లిస్తుందని.. ఈ ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలందరూ సమష్టిగా తిప్పికొట్టాలని రైతులు, మహిళలు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలే అమరావతిని కాపాడుకుంటారని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కొవిడ్ నియంత్రణపై దృష్టి పెట్టకుండా రాజధాని అమరావతి పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రైతులు, మహిళలు మండిపడ్డారు. కరోనా భయం ఉన్నప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమం చేస్తున్నామన్న రైతులు, మహిళలు.. తమ భవిష్యత్తు దెబ్బతింటుందనే కారణంగానే పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం తమ పట్ల నిర్దయగా వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు.
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలో తమకు తప్పక న్యాయం జరుగుతుందని రైతులు, మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు.
అలుపెరగని అమరావతి.. రాజధాని కోసం సడలని సంకల్పం - అమరావతి ఆందోళన న్యూస్
రాజధాని అమరావతి పరిరక్షణ లక్ష్యంగా రైతులు, మహిళల పోరాటం కొనసాగుతోంది. వరుసగా 245వ రోజు తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెం, ఉండవల్లిలో ఆందోళనలు నిర్వహించారు. అమరావతి తల్లికి పడిన సంకెళ్లను 5కోట్ల మంది రాష్ట్ర ప్రజలు తెంచాలని రైతులు, మహిళలు అభ్యర్దించారు.
అమరావతి రైతుల ఆందోళన