అమ్మఒడి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. 2019-20 విద్యా సంవత్సరానికి 45 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పిల్లల్ని చదివించే తల్లులకు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిచనున్నారు.
ప్రైవేటు విద్యార్థులకూ వర్తింపు
ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేలే ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారుల తల్లి బీపీఎల్ వర్గానికి చెందినవారై ఉండాలి. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ లేకుంటే అందుకు దరఖాస్తు చేసిన రసీదు ఉండాలి.