Ambedkar 132nd Birth Anniversary Celebrations : రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ :అంబేడ్కర్ ఆశయాలకు కట్టుబడి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో నగరపాలక సంస్థ 13.05లక్షల రూపాయలతో సుందరీకరించిన అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని, కూడలిని మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్సతో పాటు., డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ నాగలక్ష్మీ, ఎస్పీ దీపిక, నగర మేయర్ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాల నాయకులు విజ్ఞప్తి మేరకు బాలాజీ కూడలిని అంబేద్కర్ కూడలిగా పేరు మార్చామని తెలిపారు.
అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి :విజయనగరం టీడీపీ కార్యాలయంలో అంబేడ్కర్ 132 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి టీడీపీ నేతలు నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్ చేసిన సేవలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.
రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలం :విశాఖలోని డాబా గార్డెన్స్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పలు పార్టీల నేతలు, జిల్లా అధికారులు పూలమాలు వేసి నివాళులర్పించారు. విద్య విలువను దేశానికి చాటి చెప్పిన మహనీయుడు అంబేడ్కర్ అని సీపీ త్రివిక్రమ వర్మ అన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ ఆరోపించారు.అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యుడు గణబాబు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో ఉన్న జాతి వివక్షతను, అంటరాని తనాన్ని పారద్రోలిన గొప్ప నాయకుడు అని అన్నారు.
నివాళులు : అంబేడ్కర్ మహానీయుడని మంత్రి విశ్వరూప్ కొనియాడారు. అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.