రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాజకీయం చేసేందుకు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ ప్రయత్నించడం సరైంది కాదని హితవు పలికారు. జనసేన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని... కేంద్రానికి నచ్చజెప్పాల్సిన బాధ్యత పవన్‌పై లేదా అని ప్రశ్నించారు.
మోదీ, అమిత్ షా మాట్లాడుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారమవుతుందని, ఆ విషయం గురించి మాట్లాడకుండా వైకాపాపై విమర్శలు చేయడం సరికాదని అంబటి వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు ఆరోపణలు చేయడం దారుణమని విమర్శించారు. కేంద్ర సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుందని ప్రశ్నించారు.