గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోటు ప్రాంతంలో ముగ్గురాయి తవ్వకాలపై గనుల శాఖ అధికారులు దృష్టి సారించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని వైకాపా నేతలే కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అక్కడి తవ్వకాలపై నివేదిక కోరింది. గనుల శాఖ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. గనుల శాఖ ఉప సంచాలకులు సుబ్రహ్మణ్యేశ్వరావు, ఇతర అధికారులు కొండమోడు వచ్చారు. తవ్వకాలు జరిగిన తీరుని పరిశీలించారు.
అధికారులు వచ్చిన సమయంలో అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగటం లేదు. పైగా ఇటీవల కురిసిన వర్షాలకు తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో నీరు చేరింది. అక్కడ ప్రభుత్వ అనుమతి తీసుకుని మైనింగ్ చేస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. అవి కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎలాంటి తవ్వకాలు జరిగాయని సమీక్షించారు. ఏ మేరకు మైనింగ్ చేశారనే అంశాలపై ఆరా తీశారు. అక్రమ మైనింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మైనింగ్ ప్రాంతానికి వెళ్లే దారిలో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ నిత్యం ఒక అధికారి ఉండి తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.