Amaravati to Arasavelli Padayatra: అమరావతి రైతుల మహా పాదయాత్ర రథం అరసవెల్లికి బయలుదేరి వెళ్లింది. గతేడాది అక్టోబర్ 22న అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అమరావతి రైతుల పాదయాత్ర నిలిచిపోయింది. వెంకటేశ్వర స్వామి రథాన్ని రైతులు రామచంద్రాపురంలోనే నిలిపివేశారు. తాజాగా అమరావతి రైతులు.. రథానికి పూజలు చేసి అరసవెల్లికి బయలుదేరి వెళ్లారు. రైతుల పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని.. తట్టుకోలేక ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామి వద్దకు తీసుకెళ్లి మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు. 1200 రోజులుగా రాజధాని కోసం తాము ఆందోళన చేస్తున్నామని రైతుల బాధలు ప్రజలు అర్థం చేసుకున్నా.. ప్రభుత్వం మాత్రం తమ హక్కుల్ని కాలరాస్తుందని రైతులు వాపోతున్నారు.
కాగా.. అమరావతి రైతుల ఉద్యమం 1000 రోజులు పూర్తైన సందర్భంగా.. రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకూ ఈ పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రను సెప్టెంబరు 12వ తేదీన ప్రారంభించారు. రైతులు.. వెంకటపాలెంలోని తితిదే ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిగా.. మహిళలు హారతులు పట్టారు. అనంతరం ఆలయం నుంచి రైతులు ఈ పాదయాత్రను ప్రారంభించారు. రాజధాని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
అయితే 60 రోజుల పాటు.. 900 కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర సాగించాలని రైతులు అనుకున్నారు. అయితే హైకోర్టు తీర్పు తర్వాత జరిగిన పరిణామాలతో అక్టోబరు 20వ తేదీ వరకు మాత్రమే ఈ పాదయాత్రను నిర్వహించారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో ఈ యాత్ర ఆహిపోయింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పాదయాత్రలో 600 మంది పాల్గొనాలని, అందరూ గుర్తింపుకార్డులు చూపించాలని పోలీసులు అడిగారు.
అయితే రైతులకు సంఘీభావం తెలిపేవారు ఆ యాత్రలో పాల్గొనటం వల్ల కోలాహలం నెలకొంటుందని.. ఐడీకార్డులు తప్పనిసరిగా చూపించాల్సిందేనని పోలీసులు పట్టుబట్టారు. దీంతో ఈ వ్యవహారం కోర్టులోనే తేల్చుకుంటామంటూ రైతులు తమ పాదయాత్రను అక్టోబర్ 22న నిలిపివేశారు. మళ్లీ ఈ రోజు ఉత్సాహంతో రైతులు తమ యాత్రను పునఃప్రారంభించారు.
" 'అమరావతి టు అరసవెల్లి' యాత్రను.. రెండో పాదయాత్రగా మేము ప్రారంభించాము. అది జరిగిన 40వ రోజుల తర్వాత ప్రభుత్వం మాపై కొన్ని శక్తులను ప్రయోగించి.. మమ్మల్ని ఒత్తిడికి గురిచేసింది. ముఖ్యంగా మా మహిళలను ఇబ్బంది పెట్టింది. దీంతో ఈ ఒత్తిడిలను మేము తాళలేక.. నిర్ధాంతరంగా మా పాదయాత్రను నిలిపివేశాము. అయితే అప్పటి నుంచి మా దైవాన్ని ఇక్కడ వదిలేసి.. మేము మా గ్రామాలకు వెళ్లిపోయామనే మనోవేదన మమ్మల్ని వేధిస్తోంది. అందువల్ల మా దైవాన్ని అరసవెల్లి తీసుకుని వెళ్లి.. సూర్యభగవాన్ని దర్శించికుందామని అనుకుంటున్నాము. అనంతరం పాదయాత్రగా కాకుండా రోడ్డు మార్గంగా మా అమరావతికి చేరుకోవాలని అనుకుంటున్నాము."
- అమరావతి రైతు
అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర పునఃప్రారంభం