Construction of Poor Houses in Amaravati: రాజధాని అమరాతిలోని R5 జోన్‌లో రాజధానేతరులకు 45 వేల ఇళ్లను ఆప్షన్-3 కింద ప్రభుత్వమే కట్టించి ఇచ్చేలా ఉర్రూతలూగుతున్న సీఎం జగన్.. అదే ఆప్షన్ కింద రాష్ట్రంలోని 3.52 లక్షల మంది నిరుపేదలకు తామే ఇళ్లు కట్టిస్తామని.. రెండేళ్ల క్రితం మాట ఇచ్చి గాలికి వదిలేశారు. ఇప్పటివరకు కేవలం 9 వేల 631 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా అమరావతిలో షియర్‌వాల్ టెక్నాలజీతో ఆరు నెలల్లో ఇళ్లు కడతామంటున్నారు. అదే విధానాన్ని రాష్ట్రంలో మిగతా పేదలకు ఎందుకు వర్తింపజేయరు..? ఏం వారు పేదల్లా కనిపించట్లేదా..? పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఎప్పటికప్పుడు డబ్బిస్తోంది. గుత్తేదారులను ఎంపిక చేశారు. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఇచ్చేస్తున్నారు. మరి నిర్మాణాల్లో జాప్యమెందుకు అంటే ఎవరూ స్పందించరు. సమస్యలపై ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాటికి పరిష్కారం చూపకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పేర్లను తెర మీదకు తెచ్చి రాజకీయం చేసే ముఖ్యమంత్రి, మంత్రులకు.. ప్రభుత్వమే కట్టిస్తామని మాట ఇచ్చిన 3.52 లక్షల మంది లబ్ధిదారులు నిరుపేదలే అన్న విషయం తెలియదా? అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై అకుంఠిత దీక్ష కనబరుస్తున్న ఆ నేతలకు.. సొంత గూడు లేక అవస్థలు పడుతున్న ఈ పేదలు కనిపించలేదా..?
అమరావతిలో రాజధానేతరుల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ గత నెలలో 50 వేల 793 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో 45 వేల మంది ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆప్షను ఎంచుకున్నారు. 45 వేల ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారుల ఎంపిక కొనసాగుతోంది. ఈ ఇళ్ల నిర్మాణాన్ని 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు షియర్ వాల్ సాంకేతికతనూ వినియోగించనున్నారు. రాజధానిలో ఇళ్ల నిర్మాణానికి ఆగమేఘాలపై కదులుతున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే ధోరణితో ఎందుకు వ్యవహరించలేదన్నదే ప్రశ్న. నిర్మాణాన్ని ప్రారంభించిన రెండేళ్ల తర్వాత కూడా 2.28 లక్షల ఇళ్లు ఇంకా పునాది, అంతకన్నా తక్కువ స్థాయిలో ఉండటమేమిటన్న ప్రశ్న వినిపిస్తోంది.