రాజధాని రైతులు అమరావతి నినాదాన్ని దిల్లీలో లేవనెత్తారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు అమరావతి అన్నదాతలు మద్దతు పలికారు. మహిళా ఐకాస నాయకురాలు రాయపాటి శైలజ, దళిత ఐకాస నాయకుడు పులి చిన్నతో 20 మంది రైతులు దిల్లీలో ఆందోళన చేస్తున్న అన్నదాతల ధర్నాలో పాల్గొన్నారు.
రైతులకు నష్టం కల్గించే చట్టాలను రద్దు చేయాలని అన్నదాతలతో కలసి నినాదాలు చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ అనంతరం రైతులను మోసం చేశారని అక్కడి అన్నదాతల దృష్టికి తీసుకెళ్లారు. ఇపుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరును తెరపైకి తీసుకొచ్చి తమను రోడ్డుపై పడేసిందని అమరావతి రైతులు చెప్పారు. తాము సమయం చూసుకొని అమరావతికి వస్తామని బీకేఎస్ నాయకులు చెప్పారని పులి చిన్న తెలిపారు.