RBI Ap Regional Office : భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు అంశం గందరగోళానికి గురిచేస్తోంది. ఏపీ కన్నా చిన్న రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటుచేసిన ఆర్బీఐ.. మన దగ్గరకు వచ్చేసరికి మీనమేషాలు లెక్కిస్తోంది. 2018లోనే అప్పటి ప్రభుత్వం కార్యాలయం కోసం అమరావతిలో 11 ఎకరాల భూమి కేటాయించినా.. ఆర్బీఐ పనులు ప్రారంభించలేదు. దీనిపై అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు.. కేంద్ర ఆర్థిక శాఖకు 2021 అక్టోబర్‌లో లేఖ రాశారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ముంబయిలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి లేఖ వెళ్లింది. ఏపీ రాజధాని ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని.. అప్పుడే కార్యాలయం ఏర్పాటుచేస్తామని.. 2022 జనవరి 31న ఆర్బీఐ సమాధానమిచ్చింది. అప్పటికి రాజధాని అంశంపై కోర్టులో విచారణ జరుగుతుండగా 2022 మార్చి 3న అమరావతే ఏపీ రాజధాని అంటూ హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చింది. రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని జాస్తి వీరాంజనేయులు.. మళ్లీ ఆర్బీఐకి విన్నవించారు.
రాజధాని విషయంలో స్పష్టత వచ్చింది కాబట్టి.. అమరావతిలో కార్యాలయం ఏర్పాటుచేయాలని కోరారు. దీనిపై ఆర్బీఐ నుంచి ఇప్పటివరకూ సమాధానం రాలేదు. ఇటీవల ఆర్బీఐ అధికారుల బృందం విశాఖలో పర్యటించి, అక్కడ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం భవనాల్ని పరిశీలించింది. త్వరలోనే కార్యాలయం ఏర్పాటుపై నిర్ణయం వెలువడనుందని.. సమాచారం. దీనిపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..