ఏడాదికి పైగా.. అమరావతి పరిరక్షణ ఆందోళన చేస్తున్న రాజధాని గ్రామాల రైతులు, మహిళలు.. సంక్రాంతి రోజూ తమ పోరాటాన్ని ఆపలేదు. పండగ వేడుకలను సైతం.. ఆందోళనలో భాగం చేశారు. తమ ఆకాంక్షలను మరింత బలంగా చాటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తమను మోసం చేస్తున్నాయని రాజధాని రైతులు ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ.. 394వ రోజూ ఆందోళనలు చేపట్టారు.
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. ఉద్ధండరాయునిపాలెంలో గ్రామ దేవతకు పొంగళ్లు సమర్పించారు. అనంతవరంలో చిన్నారులు హరిదాసు వేషం వేసి.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. 2019 డిసెంబరు నుంచి అన్ని పండుగలు దీక్షా శిబిరాల్లో చేసుకోవడం తమకు అలవాటైపోయిందని చెప్పారు.