అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి గ్రామాల్లో 281వ రోజు రైతులు దీక్షలు నిర్వహించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నీరుకొండ, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెంలో రైతులు నిరసన కొనసాగించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు.
మూడు రాజధానులుంటాయని ఎన్నికలకు ముందే జగన్ చెప్పి ఉంటే ఫలితాలు వేరేలా ఉంటాయని అమరావతి రైతులు అన్నారు. అప్పుడు ఒకే రాజధానికి మద్దతు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని విమర్శించారు. రాజకీయాలలో ఉండే విశ్వసనీయత ఇదేనా అని రైతులు ప్రశ్నించారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందనే ప్రకటన సీఎం జగన్ నోటి నుంచి వచ్చే వరకు దీక్షలు కొనసాగుతాయని రైతులు స్పష్టం చేశారు.