AMARAVATI FARMERS PROTEST AT DELHI : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టారు. తమ ఉద్యమాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధానిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రైతుల నిర్ణయించారు. దీనిలో భాగంగా ‘ధరణికోట నుంచి ఎర్రకోట’ పేరుతో ప్రత్యేక రైలులో దిల్లీ చేరుకున్న రైతులు.. ఇవాళ జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు.
రైతుల నిరసనకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ నేతలు మద్దతు పలికారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జనసేన నేత హరిప్రసాద్ తదితరులు సంఘీభావం తెలిపారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి వివిధ పార్టీల నేతలను అమరావతి రైతులు కలవనున్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అమరావతి ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించనున్నారు.
సోమవారం రామ్‌లీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో రైతులు పాల్గొననున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ అమరావతి రైతు ఉద్యమాన్ని తమ సమావేశంలో ప్రత్యేక అజెండాగా చేర్చింది.
కచ్చితంగా అమరావతిని సాధించుకుందాం: అమరావతి రైతుల ఆవేదనపై పార్లమెంటులోనూ మాట్లాడుతున్నామని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తెలిపారు. అందరం కలిసికట్టుగా పోరాడి అమరావతి సాధించుకుందామని పిలుపునిచ్చారు. కచ్చితంగా అమరావతిని సాధించుకుందామన్నారు. భవిష్యత్తులో మంచి రోజులు మనకు వస్తాయని.. న్యాయం మనవైపు ఉంది కాబట్టి భయపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
ఒకే ఒక రాజధానిగా అమరావతి ఉంటుంది: వ్యక్తిగత ద్వేషంతో అమరావతిని నాశనం చేయడం దారుణమని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు. ఆలస్యమైనా మనకు న్యాయమే జరుగుతుందని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని అన్నారు. ఎన్నికల్లో ప్రభుత్వాన్నే మార్చుకునే దిశగా ముందుకెళ్దామన్నారు. ఒకే ఒక రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపారు.
రైతుల డిమాండ్లను జగన్ పట్టించుకోవడం లేదు: అమరావతి రాజధాని డిమాండ్ న్యాయమైనది సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని జగన్‌కు సలహా ఇచ్చారు. మొండిగా ప్రవర్తించి సమస్యను మరింత జటిలం చేయొద్దని సూచించారు. రైతుల డిమాండ్లను జగన్ పట్టించుకోవడం లేదని.. ప్రజా తీర్పుకు ఎవరైనా తల వంచాల్సిందేనన్నారు.