మందడం వద్ద రాజధాని రైతుల ఆందోళన Amaravati Farmers Protest : రాజధాని అమరావతిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. భూసమీకరణలో భాగంగా తమకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా సీడ్‌యాక్సిస్ రహదారి పక్కనే ఉన్న ప్లాట్లలో మట్టి తవ్వుతున్నారని సమాచారం తెలుసుకుని.. సోమవారం అర్థరాత్రి గస్తీ నిర్వహించామని రైతులు చెబుతున్నారు. అదే సమయానికి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను చూసి ఆపామని.. అయితే కొందరు తమను నెట్టేసి వాహనాలను తీసుకెళ్లారని తెలిపారు. పైగా అసభ్యపదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మట్టిని తరలిస్తున్న వాహనాలపై నందిగం అని రాసి ఉందని.. ఎంపీ నందిగం సురేష్ మట్టిని అక్రమంగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. గతంలో రాజధాని నిర్మాణానికి తీసుకొచ్చిన సిమెంట్, ఇనుమును దొంగలించారని, రోడ్డుపై కంకరను తవ్వేశారని.. ప్రస్తుతం ప్లాట్లలో మట్టిని సైతం తవ్వేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మట్టిని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలంటూ.. మందడం దీక్షా శిబిరం వద్ద నిరసనకు దిగారు. జోరు వానలో కూడా ఆందోళన కొనసాగించారు.
ఇదీ చదవండి : Nandyal Municipal Council Meeting: నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస.. ఆ కారణంతోనే..
"మా ఫ్లాట్లలో మట్టి తవ్వుతున్నారు. మొన్న ఉదయం చూశాము. రాత్రి మట్టి తవ్వతున్నారని తెలియగానే మళ్లీ వెళ్లాము. మట్టి బండ్లను అక్కడి నుంచి పోనీయకుండా అడ్డుగా నిల్చున్నాము. ఈ లోపు ఎంపీ మనుషులు వచ్చి బూతులు తిట్టారు. అడ్డం వస్తే తొక్కిస్తామని బెదిరించారు." -రైతు
"సీఆర్డీఏ కమిషనర్, ఎంపీ సహకారం లేనిదే ఇక్కడ ఏ పని జరగదు. మేము వెళ్లి అడిగితే మిమ్మల్ని లారీలతో తొక్కిస్తాము. మీరు ఏం చేస్తారంటూ మమ్మల్ని నెట్టివేస్తున్నారు. మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మేము ఏమన్నా అంటే మా మీద కేసులు పెడ్తున్నారు." -రైతు
మందడం రైతులకు తుళ్లూరు అన్నదాతలు సంఘీభావం పలికారు. వైసీపీ ప్రభుత్వం కక్షతోనే అమరావతిని నాశనం చేస్తోందన్న రైతులు.. తాము స్పష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న రైతులతో పోలీసులు చర్చలు జరిపారు. రైతులపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తామని.. అక్రమమట్టి తవ్వకాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని రైతులు తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి :