Amaravati farmers On R5 Zone: ఆర్-5జోన్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం తమకు న్యాయం చేస్తుందని.. రాజధాని ఐకాస నాయకులు పువ్వాడ సుధాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి కేసులతో కలిపి ఆర్-5జోన్ అంశాన్ని కూడా విచారించాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. మరో మూడు రోజుల్లో సుప్రీంకోర్టులో ఈ అంశం విచారణకు వస్తున్నందున అప్పటివరకు ఆర్-5 జోన్లో పనులు ఆపేయాలని, ప్లాట్ల పంపిణీ ప్రక్రియ వాయిదా వేయాలని రైతులు కోరుతున్నారు.
మాస్టర్ ప్లాన్ ను చెడగొట్టడమే ప్రభుత్వ లక్ష్యం: ఆర్-5 జోన్కు వ్యతిరేకంగా రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజధాని అభివృద్ధి కోసం తమ భూములు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నాశనం చేసి ఇష్టారీతిన భూముల పంపిణీకి తెరలేపిందని ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం ఆర్-3 జోన్ భూములు ఉన్నప్పటికీ.. ప్రత్యేకించి ఆర్-5 జోన్ ఎందుకని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ను చెడగొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. రాజధానిని అభివృద్ధి చేయకుండా ఇతర ప్రాంతాల్లోని పేదలను తీసుకువచ్చి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏం చేస్తారని వారు ప్రశ్నించారు. ఇక్కడ ఉన్నవారికే ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే.. బయట వారిని తెచ్చిపెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.