Amaravati Farmers Movement Reached 1400 Days: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 1400 రోజులకు చేరింది. ఈ సందర్భంగా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రైతులు, మహిళలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అమరావతికి అంతా మంచే జరగాలని, చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని, ఆయనకు త్వరగా బెయిల్ రావాలని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సీఎం జగన్ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా అమరావతిని కదిలించలేరని రాజధాని రైతులు ధీమా వ్యక్తంచేశారు. ప్రజలను మభ్య పెట్టడానికే 3 రాజధానులంటూ పూటకో ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి రాజధానికి అన్యాయం చేస్తోన్న జగన్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలుగెత్తి చాటుతామని రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి వెల్లడించింది. రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి 1400 రోజులైన సందర్భంగా విజయవాడ ఆటోనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతుల ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్, దళిత, మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Amaravati Framers Protest Completed 1400 Days: 1400 రోజులు పూర్తిచేసుకున్న అలుపెరుగని పోరాటం..
ఈ సందర్భంగా తమ భవిష్యత్తు కార్యాచరణను వారు వెల్లడించారు. అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని.. రాజధానిగా అమరావతిని నిర్ణయించేటప్పుడు జగన్ ఏం చేశారని సుధాకర్ ప్రశ్నించారు. విశాఖపట్నం వెళ్తానని సీఎం పదే పదే చెప్పడం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికేనని సుధాకర్ ఆరోపించారు. భవిష్యత్తులో రైతుల ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని.. ఒక్కో రైతు ఒక్కో సైనికుడై రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో తమ గళాన్ని వినిపిస్తారని చెప్పారు.