ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి @ 1200.. 'రాజధాని వ్యతిరేక శక్తులు వచ్చే ఎన్నికల్లో కొట్టుకుపోవటం ఖాయం' - నేటి ముఖ్యంశాలు

Amaravati Farmers : రాజధాని రైతుల పోరాటం నేటితో 1200వ రోజుకు చేరుకుంది. రాజధానిని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని.. అమరావతి రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. వీరి పోరాటాన్ని ఆపటానికి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా.. రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తూ 1200వ రోజుకు చేరుకుంది.

farmers padayatra reached to 1200 day
1200 రోజుకు అమరావతి రైతుల పోరాటం

By

Published : Mar 31, 2023, 12:55 PM IST

Updated : Mar 31, 2023, 5:40 PM IST

Amaravati Farmers Padayatra: రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తోందని.. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు ఉద్యమం చేపట్టగా, అది శుక్రవారంతో 1200 రోజుకు చేరుకుంది. పోరాటాన్ని ప్రారంభించి నేటికి పన్నెండు వందల రోజులు చేరుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా మందడంలో రాజధాని రైతు ఐకాస ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అమరావతి రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.

ప్రత్యేక కార్యక్రమాలు, పాల్గొన్న నేతలు : 'దగాపడ్డ రైతులు, దోపిడీకి గురవుతున్న ఆంధ్రా పౌరులు' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను రాజధాని రైతు ఐకాస నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, పంచుమర్తి అనురాధ హాజరయ్యారు. బీజేపీ తరఫున సత్యకుమార్, ఆదినారాయణరెడ్డి, వల్లూరు జయప్రకాశ్‌ హాజరుకాగా.. ప్రత్యేక అతిథిగా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ హాజరయ్యారు.

టీడీపీ అధినేత స్పందన :అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 1,200 రోజులకు చేరుకున్న సందర్భంగా.. రైతుల పోరాటానికి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. మీ ఉద్యమంలో న్యాయం ఉంది అని.. మీ వైపే ధర్మం ఉందని వ్యాఖ్యనించారు. ఆంక్షలు, వేధింపులను ఎదిరించి ముందుకు సాగుతున్నారని అన్నారు. అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతే అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒక్క మట్టిపెళ్ల కదిలించలేరు : వైసీపీ దుష్ట దుర్మార్గానికి ఎదురొడ్డి ఉద్యమిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి అభినందించారు. దేశంలోని నగరాలతో పోటీపడే శక్తి అమరావతికి ఉందని చంద్రబాబు నమ్మారని అన్నారు. అమరావతి 29 గ్రామాలది కాదని.. ప్రపంచంలోని కోట్లాది తెలుగు ప్రజలది అని కోటం రెడ్డి వ్యాఖ్యనించారు. అమరావతి అప్పుడు ముద్దు, ఇప్పుడెందుకు కాదో జగన్‌ చెప్పాలని ప్రశ్నించారు. జగన్ అమరావతికి జైకొడితే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ చెబితే అమరావతి ఇక్కణ్నుంచి కదిలే అవకాశం లేదన్నారు. అమరావతి నుంచి ఒక్క మట్టిపెళ్ల కూడా వైసీపీ ప్రభుత్వం కదిలించలేదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకొనిపోతాయని దుయ్యబట్టారు.

జగన్​ మాట మార్చారు : అమరావతి రైతులు 12 వందల రోజులుగా పోరాడుతున్నా ప్రభుత్వ స్పందన లేదని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు. అమరావతికి అసెంబ్లీలో అంగీకరించి తర్వాత జగన్ మాట మార్చారని అన్నారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా మండలి ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా టీడీపీ గెలుస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

"అమరావతి రైతులకు మద్దతు తెలిపిన దగ్గరి నుంచి వైసీపీలో నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అయినా నేను భయపడటం లేదు. భవితరాల కోసం అమరావతి రాజధానిని చంద్రబాబు ఏర్పాటు చేస్తే.. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి అమరావతిని కాలరాశాడు. ఏ రాజకీయ పార్టీ అయితే అమరావతి నుంచి మట్టి పెళ్ల కూడా కదలదని చెప్తుందో.. ఆ పార్టీలకు అనుకూలంగా ఎన్నికల సునామి రాబోతుంది. అమరావతికి వ్యతిరేకంగా ప్రయత్నించిన శక్తులు ఆ సునామిలో కొట్టుకుపోవటం ఖాయం." -కోటం రెడ్డి, నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే

"29 వేల మంది రైతులు, 33వేల ఎకరాల భూముులు ఇస్తే దానికి విలువ ఉందా. రైతు ఘోష మంచిదేనా, ఆడవాళ్ల ఏడుపు మనకు మంచిదేనా. అసెంబ్లీలో మీరు అన్నారు. మీ నోటితోనే అన్నారు. ఏకైక రాజధాని అమరావతి అని. ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటాను అన్నారు. ఇప్పుడు మాట మార్చారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిని చేస్తాము." -పంచుమర్తి అనురాధ, టీడీపీ నాయకురాలు

"రాష్ట్ర భవిష్యత్​ పూర్తిగా అమరావతిపై అధారపడి ఉంది. అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో.. వైసీపీతో కలిపి రాజధానిగా అమరావతి ఏర్పాటైంది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను నమ్మి ఎంతోమంది స్టేక్​ హోల్డర్స్​ అమరావతికి వచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలు, అమరావతి ప్రజలతో కలిపి నీకు అధికారం ఇచ్చారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా మిగిలి ఉన్న రోజులైనా పని చేయటానికి ప్రయత్నించు. "-కన్నా లక్ష్మినారాయణ, టీడీపీ నేత

"1200 రోజులు ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. ఇది భారతదేశ చరిత్రలో సుధీర్ఘ పోరాటం. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటం మన అమరావతి రైతుల పోరాటం. ముఖ్యమంత్రి వారానికి రెండుసార్లు అమిత్​ షా దగ్గరికి వెళ్తున్నాడు. అమిత్​ షా అనుగ్రహం లేకపోతే జైలులో ఉంటాడు." -రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

"జై జగన్​ అని అనకపోతే కార్యకర్తల్ని గొంతుకోసి చంపుతున్నారు. ఇది రాష్ట్రమా ? వల్లకాడ ? పరిపాలనా ? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించటమే మా ఏకైక లక్ష్యం." -బాలకోటయ్య, అమరావతిబహుజన జేఏసీ అధ్యక్షుడు

"నీకు అమరావతిలో నీకు ఏమైనా భూములు ఉన్నాయా అని నన్ను చాలా మంది అడిగారు. అమరావతి రైతులు ఇచ్చిన ప్రతి సెంటు భూమి నా సొంత భూమిగా భావిస్తానని చెప్తున్నాను. రైతు కంట కన్నీరు దేశానికి మంచిది కాదు. రాష్ట్రానికి అరిష్టం." -జడ శ్రావణ్​ కుమార్​, జై భీమ్​ భారత్​ పార్టీ వ్యవస్థాపకుడు

"1200 రోజులుగా ఉద్యమం అంటే చిన్న విషయం కాదు. దాదాపు 200 మంది ప్రాణత్యాగాలు చేశారు. అయినా జగన్​ మోహన్​ రెడ్డికి చలనం కలగటం లేదు. ఇది భూ స్వాములు చేస్తున్న ఉద్యమం, ఒక సామాజిక వర్గం చేస్తున్న ఉద్యమం అని అభివర్ణిస్తున్నారు." - సత్యకుమార్​, బీజేపీ నేత

నేటితో 1200వ రోజుకు రాజధాని రైతుల పోరాటం

ఇవీ చదవండి :

Last Updated : Mar 31, 2023, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details