AMARAVATI FARMERS SERIOUS ON GOVT : రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. స్వయానా దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు. కొంతమేర పనులూ జరిగాయి. కానీ 2019లో వైఎస్సార్సీపీ సర్కారు వచ్చినప్పటి నుంచి అమరావతి పట్ల ప్రతి అడుగులోనూ వ్యతిరేకత కనబడుతోంది. రాజధాని విషయంలో తమను మరింత గందరగోళానికి గురిచేయటమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అమరావతి రైతులు మండిపడుతున్నారు.
2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన నుంచి తాజాగా మంత్రి బుగ్గన విశాఖే రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యల వరకూ ప్రతి అడుగులోనూ వైసీపీ ప్రభుత్వ మోసం, కుట్ర కనిపిస్తున్నాయంటున్నారు. నరం లేని నాలుక అష్ట వంకర్లు తిరిగిందనే సామెతను వారు గుర్తుచేస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. భూములిచ్చిన రైతులను వేధించటం, ఎలాగోలా దెబ్బకొట్టడమే ప్రభుత్వ ఉద్దేశమని వారు చెబుతున్నారు.
మూడు రాజధానుల పేరిట ప్రభుత్వం తెచ్చిన బిల్లులపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ప్రస్తుతం ఆ కేసులు విచారణ దశలో ఉండగా బాధ్యతతో వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇలా పూటకో మాట మాట్లాడటం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది కోర్టు ధిక్కరణగా రైతులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.