గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో మహిళా రైతులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. దీక్షా శిబిరం వద్ద 151 బొమ్మలతో కొలువు ఏర్పాటు చేశారు. ఇందులో నీలిరంగు వైకాపా, ఆకుపచ్చ రంగు భాజపా, పసుపు రంగు తెదేపా.. ఇలా వివిధ పార్టీల శాసనసభ్యులను సూచించేలా తయారుచేశారు. ఆయా పార్టీల నుంచి అధికార పార్టీలోకి వచ్చిన శాసనసభ్యులను సూచించేలా కొలువు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో సీఎం అధికార శాసనసభ్యులను బొమ్మల్లా తయారు చేసి ఆడిస్తున్నారనే సంకేతం వచ్చేలా మహిళలు దీనిని తయారు చేశారు. నిరసన దీక్షలో ఈ బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమరావతి విషయంలో అందరూ బొమ్మల్లా తయ్యారయ్యారని మహిళలు అన్నారు. మాజీ మంత్రి పుల్లారావు బొమ్మల కొలువును తిలకించి అతివలను అభినందించారు. చక్కటి సందేశం వచ్చేలా తయారు చేశారని ప్రశంసించారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని మహిళలు ప్రశ్నించారు.