Amaravathi SC JAC Protest Against Mla Sridevi: అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు జిల్లా తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి తన పదవికి రాజీనామా చేయాలంటూ అమరావతి ఎస్సీ ఐకాస నేతలు డిమాండ్ చేశారు. శ్రీదేవి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ తుళ్లూరు అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఎస్సీ ఐకాస నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై ఎమ్మెల్యే శ్రీదేవి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని గుంటూరు జిల్లా మర్రిచెట్టు పాలెం దళిత సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా.. నార్కట్ పల్లి - అద్దంకి హైవేపై ఆందోళనకు దిగారు. శ్రీదేవి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
వివాదం ఏంటంటే..?
ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ 4వ మాదిగ మహాసభలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.."రాజ్యంగం రచించిన అంబేడ్కర్ అందరికీ తెలుసు. కానీ రాజ్యంగం పార్లమెంట్లో అమలయ్యేందుకు బాబు జగ్జీవన్‌రాం కృషి చేశారు. స్వాతంత్య్ర సమరంలో ఆయన పోరాటం చేశారు. మనం బాబు జగ్జీవన్రాంను ఆదర్శంగా తీసుకోవాలి." అని వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలు శ్రీదేవికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.